తన ఉద్యోగులకు వచ్చే ఏడాది జూలై వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించాలని ఫేస్ బుక్ నిర్ణయం

07-08-2020 Fri 13:26
  • కరోనా వ్యాప్తితో ఆఫీసులు మూసేసిన ఫేస్ బుక్
  • కొన్నిచోట్ల పరిమిత సంఖ్యలో ఉద్యోగులతో కార్యాలయాలు
  • ఇంటి వద్ద నుంచి పనిచేసే ఉద్యోగులకు 1000 డాలర్ల సాయం
Facebook allow its employs to work from home till next year July

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పనిచేయాలని ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే ఈ వర్క్ ఫ్రం హోం విధానం అమలు చేస్తున్న ఫేస్ బుక్... కరోనా వ్యాప్తి ఇప్పట్లో తగ్గేట్టు లేదని భావిస్తోంది. అందుకే తన ఉద్యోగులను 2021 జూలై వరకు వర్క్ ఫ్రం హోమ్ విధానంలోనే పనిచేయాలని ఆదేశించింది.

అంతేకాదు, ఇంట్లోనే ఆఫీసు సెటప్ ఏర్పాటు చేసుకునేందుకు ఒక్కొక్కరికి 1000 డాలర్లు ఇస్తోంది. ఇప్పటికే గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు కొందరు కీలక ఉద్యోగులను మినహాయించి మిగతావారిని ఇళ్ల వద్ద నుంచే పనిచేయాలని ఆదేశించాయి. ఫేస్ బుక్ కూడా ఇదే బాటలో నడుస్తోంది. స్వచ్ఛందంగానే ఇళ్ల వద్ద నుంచి పనిచేయాలని కోరుకుంటున్న వారిని తాము ప్రోత్సహిస్తామని ఫేస్ బుక్ అధికార ప్రతినిధి తెలిపారు.

వచ్చే ఏడాది వరకు వారు ఆఫీసుకు రానవసరంలేదని స్పష్టం చేశారు. అయితే, ఆయా దేశాల ప్రభుత్వాల మార్గదర్శకాలు అనుమతిస్తే పరిమిత సంఖ్యలో ఉద్యోగులతో ఆఫీసులు తిరిగి తెరిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అయితే కరోనా ప్రభావం అధికంగా ఉన్న దృష్ట్యా అమెరికాలోనూ, లాటిన్ అమెరికా దేశాల్లోనూ అనేక చోట్ల ఈ ఏడాది చివరి వరకు ఆఫీసులు తెరిచే పరిస్థితి లేదని ఫేస్ బుక్ ప్రతినిధి పేర్కొన్నారు.