VIVO: ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి వివో తప్పుకున్నట్టు అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ

  • 2022 వరకు ఐపీఎల్ స్పాన్సర్ హక్కులు కలిగివున్న వివో
  • ఈ ఏడాదికి స్పాన్సర్ గా వ్యవహరించరాదని వివో నిర్ణయం
  • సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలే కారణం!
BCCI announced IPL suspends partnership with VIVO for this seasom

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్పాన్సర్ షిప్ హక్కులు కలిగివున్న చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, చైనా బలగాల సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో తనపై తీవ్ర విమర్శలు వస్తుండడంతో ఈ ఏడాదికి ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకుంది.

వాస్తవానికి వివో సంస్థకు 2022 వరకు ఐపీఎల్ స్పాన్సర్ షిప్ ఉంది. 2018లో ఈ మేరకు బీసీసీఐ, వివో మధ్య ఒప్పందం కుదిరింది. ఐదేళ్ల కాలానికి రూ.2199 కోట్లు చెల్లించేందుకు వివో ముందుకు రావడంతో ఐపీఎల్ స్పాన్సర్ గా ఆ చైనా సంస్థనే ఖరారు చేశారు.

అయితే, ఇటీవలి సరిహద్దు ఘర్షణలతో దేశవ్యాప్తంగా చైనా వ్యతిరేకత తీవ్రమైంది. ఐపీఎల్ నుంచి వివో తప్పుకోవాలంటూ డిమాండ్లు అధికం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఒత్తిళ్లకు తలొగ్గిన వివో... బీసీసీఐతో చర్చల అనంతరం ఈ ఏడాదికి స్పాన్సర్ గా వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.

ఈ పరిణామాలపై బీసీసీఐ ఏకవాక్య ప్రకటన చేసింది. "భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు, వివో మొబైల్ ఇండియా లిమిటెడ్ 2020కి గాను ఐపీఎల్ లో తమ భాగస్వామ్యాన్ని నిలుపుదల చేయాలని నిర్ణయించుకున్నాయి " అంటూ పేర్కొంది.

More Telugu News