Sameer Sharma: ముంబయిలో టీవీ నటుడి ఆత్మహత్య... మరోసారి ప్రశ్నార్థకమైన వినోదరంగం తీరుతెన్నులు!

  • విగతజీవుడై కనిపించిన బుల్లితెర నటుడు సమీర్ శర్మ
  • మృతదేహాన్ని గుర్తించిన వాచ్ మన్
  • రెండ్రోజుల కిందట ఉరివేసుకుని ఉంటాడని పోలీసుల వెల్లడి
TV actor Sameer Sharma dies in his residence

ఇటీవలే బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోగా, ఆ ప్రకంపనలు ఇప్పటికీ తగ్గలేదు. తాజాగా ఓ టీవీ నటుడు విగతజీవుడై కనిపించడం వినోదరంగం పరిస్థితులపైకి మరోసారి అందరి దృష్టి మళ్లింది. యే రిష్తే హై ప్యార్ కే సీరియల్ లో నటించిన సమీర్ శర్మ (44) ముంబయిలోని మలాడ్ లో ఉన్న తన నివాసంలో కిచెన్ లో సీలింగ్ కు వేళ్లాడుతున్న స్థితిలో కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. సమీర్ శర్మ ఆ అపార్ట్ మెంట్ లో ఇటీవలే అద్దెకు దిగాడు.

కాగా, సమీర్ శర్మ మృతదేహాన్ని మొదట అపార్ట్ మెంట్ వాచ్ మన్ గుర్తించాడు. సంఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాకపోవడంతో పోలీసులు దీనిని ప్రమాదవశాత్తు జరిగిన మృతి ఘటనగా కేసు నమోదు చేసుకున్నారు. రెండ్రోజుల క్రితం ఉరివేసుకుని ఉంటాడని భావిస్తున్నామని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. సమీర్ శర్మ కహానీ ఘర్ ఘర్ కీ, క్యోంకీ సాస్ భీ కభీ బహు తీ సీరియళ్లతో గుర్తింపు తెచ్చుకున్నాడు.

సమీర్ జూలై 22న డిప్రెషన్ కు సంబంధించి సోషల్ మీడియాలో చేసిన పోస్టు... సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారాన్ని జ్ఞప్తికి తెస్తోంది. సుశాంత్ కూడా డిప్రెషన్ బాధితుడేనని తెలిసిందే. అనేక అవకాశాలు చేజారిపోవడం, ఇండస్ట్రీలో నెలకొన్న బంధుప్రీతి సుశాంత్ ను మనోవేదనకు గురిచేశాయని ఇప్పటికీ ప్రచారం జరుగుతోంది.

More Telugu News