Ayodhya Ram Mandir: జగన్ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేసిన టీటీడీ.. అయోధ్య భూమిపూజను ఎందుకు ప్రసారం చేయలేదు: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి నిలదీత

  • భూమిపూజను ప్రపంచ వ్యాప్తంగా 250 ఛానళ్లు ప్రత్యక్షప్రసారం చేశాయి
  • 10 రోజుల క్రితమే టీటీడీని ప్రత్యక్షప్రసారం కోసం విన్నవించాం
  • ఈ ఘటనపై జగన్ తక్షణమే స్పందించాలి
BJP fires on TTD for not telecasting Ayodhya Bhoomi Pooja in SVBC

అయోధ్య రామాలయం నిర్మాణానికి నిన్న ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమిపూజ జరిగిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం ద్వారా ఎంతో భక్తితో వీక్షించారు. మరోవైవు టీటీడీకి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) మాత్రం ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయలేదు. దీనిపై బీజేపీ నిప్పులు చెరిగింది.

ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, టీటీడీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా బీబీసీ సహా 250 టీవీ ఛానళ్లు భూమిపూజను ప్రత్యక్షప్రసారం చేశాయని... టీటీడీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ విశాఖ శారదాపీఠానికి వెళ్లినప్పటి కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేసిన ఎస్వీబీసీ చానల్ ... ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న, హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న అయోధ్య భూమిపూజను ఎందుకు ప్రసారం చేయలేదని మండిపడ్డారు.

అయోధ్య కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేయాలని 10 రోజుల ముందే టీటీడీని కోరామని చెప్పారు. అయితే, పట్టించుకోలేదని మండిపడ్డారు. టీటీడీ నిర్వాకంతో ఎంతో మంది భక్తులు ఒక అపురూపమైన కార్యక్రమాన్ని వీక్షించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దారుణంపై సీఎం జగన్, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తక్షణమే స్పందించాలని అన్నారు.

More Telugu News