Ahmedabad: అహ్మదాబాద్ కరోనా ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం... 8 మంది సజీవ దహనం!

8 Died after Fire Accident in Ahmadabad Hospital
  • నేటి తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్
  • ఐసీయూలోని రోగుల దుర్మరణం
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నరేంద్ర మోదీ
  అహ్మదాబాద్ లో కరోనా రోగులకు చికిత్సను అందిస్తున్న ఓ ఆసుపత్రిలో ఈ తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించగా, ఎనిమిది మంది సజీవదహనం అయ్యారు. నవ్ రంగ్ పుర ప్రాంతంలోని షెర్రే హాస్పిటల్ లో తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే ఎనిమిది ఫైర్ ఇంజన్లు, 10 అంబులెన్స్ లు ఘటనా స్థలికి చేరుకున్నాయి. ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులోనే అత్యధిక నష్టం సంభవించింది. ఇక్కడ చికిత్స పొందుతున్న ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు కన్నుమూశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

మొత్తం 50 పడకల సామర్థ్యమున్న ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో 45 మంది రోగులున్నారు. మిగతా వారిని అందరినీ కాపాడి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, మృతుల కుటుంబీకులకు సానుభూతిని తెలిపిన ఆయన, ఈ క్లిష్ట పరిస్థితుల్లో వారు ధైర్యంగా ఉండాలని కోరారు. ఆసుపత్రిలో పరిస్థితిపై సీఎం విజయ్ రూపానీ, నగర మేయర్ లతో మాట్లాడానని, బాధితులకు అన్ని విధాలుగా సాయపడతామని హామీ ఇచ్చారు. తక్షణ సాయంగా మృతులకు రూ.2 లక్షల చొప్పున పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మంజూరు చేస్తున్నామని, గాయపడిన వారికి, రూ. 50 వేలు ఇస్తామని ఆయన తెలిపారు.
Ahmedabad
Hospital
Fire Accident

More Telugu News