Irland: ఐర్లండ్ సంచలనం.. మూడో వన్డేలో ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన పసికూన

Stirling and Balbirnie fire Ireland to famous win
  • తొలి రెండు వన్డేలను గెలుచుకుని సిరీస్ సొంతం చేసుకున్న ఇంగ్లండ్
  • 329 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన ఐర్లండ్
  • సెంచరీలతో చెలరేగిన స్టిర్లింగ్, ఆండ్రూ బాల్బిర్నీ
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సౌతాంప్టన్‌లోని ది రోజ్‌బౌల్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో పసికూన ఐర్లండ్ జట్టు సంచలనం సృష్టించింది. 329 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

 ఐర్లండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్, కెప్టెన్ ఆండ్రూ బాల్బిర్నీలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఇంగ్లిష్ బౌలర్లకు చుక్కలు చూపించారు. స్టిర్లింగ్ 128 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 142 పరుగులు చేయగా, బాల్బిర్నీ 112 బంతుల్లో 12 ఫోర్లతో 113 పరుగులు చేయడంతో ఐర్లండ్ జట్లు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా విజయాన్ని అందుకుంది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ మోర్గాన్ 84 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 106 పరుగులు చేయగా, టామ్ బాంటన్ (58), విలీ (51) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. టామ్ కరన్ 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఐర్లండ్ బౌలర్లలో క్రెయిగ్ యంగ్ 3 వికెట్లు పడగొట్టగా, జోషువా లిటిల్, కర్టిస్ కాంఫెర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మార్క్ అడైర్, గరెత్ డెలానీ చెరో వికెట్ తీశారు. 128 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన పాల్ స్టిర్లింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక కాగా, డేవిడ్ విలీ ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. కాగా, మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు వన్డేలు గెలుచుకున్న ఇంగ్లండ్ ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకుంది.
Irland
England
One day
Cricket

More Telugu News