Pawan Kalyan: ఆ ఘటన గురించి తెలుసుకుంటే హృదయం ద్రవించింది: పవన్ కల్యాణ్

Pawan Kalyan responds on atrocities on women
  • మహిళను ట్రాక్టర్ తో తొక్కించిన ఘటనపై పవన్ వ్యాఖ్యలు
  • చట్టాలు చేసి ఏం ప్రయోజనం అంటూ ఆగ్రహం
  • పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు అంటూ విమర్శలు
గుంటూరు జిల్లాలో ఓ గిరిజన మహిళను ఓ వడ్డీ వ్యాపారి ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటన తనను దిగ్బ్రాంతికి గురిచేసిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆ ఘటన గురించి తెలుసుకుంటే తన హృదయం ద్రవించిపోయిందని తెలిపారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలో శివాపురం తండాకు చెందిన రమావత్ మంత్రుబాయిని ఓ వడ్డీ వ్యాపారి ట్రాక్టర్ తో తొక్కించి చంపడం తీవ్ర కలకలం రేపింది. దీనిపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలపై ప్రచారం తప్ప మహిళల మానప్రాణాలకు రక్షణ ఏది అంటూ ప్రశ్నించారు.

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించేందుకు దిశ చట్టం తీసుకువచ్చాం, దిశ స్టేషన్లు ఏర్పాటు చేశాం అని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం... గిరిజన మహిళలపై దాష్టీకాలకు పాల్పడుతున్నా చర్యలు తీసుకోవడంలేదని, కేసులు నమోదు చేసుకునేందుకు పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. అటవీ భూమిని సాగు చేసుకుంటున్న ఆ గిరిజన కుటుంబంపై ఘాతుకానికి పాల్పడ్డ ఆ వడ్డీ వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు.

అంతేకాకుండా, కర్నూలు జిల్లాలో ఓ గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం జరిగినా, పోలీసులు కేసు నమోదు చేయలేదని మీడియా ద్వారా తెలిసిందని, భర్త కళ్లెదుటే అత్యాచారం చేశారని బాధితురాలు చెప్పినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టాలు చేసి ఏం ప్రయోజనం? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో తరచుగా చోటు చేసుకుంటున్నా పోలీసులు కఠినంగా వ్యవహరించడంలేదు అంటే వారిపై రాజకీయ ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుందని పేర్కొన్నారు. దళిత వర్గానికి చెందిన మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై ఇలాంటి దారుణాలు జరగడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
Pawan Kalyan
Women
Atrocities
Police
Andhra Pradesh

More Telugu News