Uma Bharathi: అయోధ్యకు వెళ్తున్నా.. కానీ భూమి పూజ కార్యక్రమానికి మాత్రం వెళ్లను: ఉమా భారతి

I wont attend Ayodhya ground breaking ceremony says Uma Bharathi
  • భూమి పూజ సమయంలో సరయూ నది తీరంలో గడుపుతా
  • అందరూ వెళ్లి పోయిన తర్వాత భూమి పూజ ప్రాంతానికి వెళ్తా
  • కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నా

ఈ నెల 5వ తేదీన అయోధ్య రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు వీవీఐపీలు హాజరుకానున్నారు. బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమాభారతికి కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అయోధ్యకు తాను వెళ్తున్నానని చెప్పారు. అయితే భూమి పూజ కార్యక్రమానికి మాత్రం వెళ్లనని తెలిపారు. భూమి పూజ సమయంలో సరయూ నది తీరంలో గడుపుతానని చెప్పారు.

కరోనా కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని... తన నిర్ణయం వెనుక మరో కారణం లేదని అన్నారు. భూమి పూజ పూర్తైన అనంతరం... అందరూ వెళ్లిపోయిన తర్వాత తాను ఆ స్థలానికి వెళ్తానని చెప్పారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు కొందరు అగ్రనేతలకు కరోనా సోకడంతో తాను ఆందోళనకు గురవుతున్నానని తెలిపారు. భూమి పూజకు వస్తున్న వారి గురించి కూడా ఆందోళన చెందుతున్నానని... ముఖ్యంగా ప్రధాని మోదీ విషయంలో ఆందోళనకు గురవుతున్నానని చెప్పారు. భోపాల్ నుంచి ఉత్తరప్రదేశ్ కు రైల్లో వెళ్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News