South korea: కరోనా భయంతో కరెన్సీ నోట్లను వాషింగ్‌మెషీన్‌లో వేసి శుభ్రం చేసిన వ్యక్తి.. తర్వాత లబోదిబో!

  • కరోనా భయంతో నోట్లను ఉతికిన వైనం
  • ముద్దగా మారిన నోట్లను చూసి బ్యాంకుకు పరుగులు
  • ఊరటగా కొంత మొత్తం ఇచ్చి పంపిన అధికారులు
korean tries washing money over virus fears suffers loss

కరెన్సీ నోట్ల ద్వారా కరోనా సోకుతుందన్న భయంతో వాటిని వాషింగ్ మెషీన్‌లో వేసి శుభ్రం చేసిన ఓ వ్యక్తి ఆ తర్వాత వాటి అవతారం చూసి లబోదిబోమంటూ బ్యాంకుకు పరుగులు పెట్టాడు. చినిగిపోయి పిప్పిగా మారిన వాటి స్థానంలో కొత్తవి ఇవ్వాలని వేడుకున్నాడు.

దక్షిణ కొరియాలో జరిగిన ఈ ఘటన కరోనా విషయంలో ప్రజలు ఎంతగా భయపడుతున్నదీ చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ. కరెన్సీ నోట్ల ద్వారానూ కరోనా వస్తుందన్న భయం నేపథ్యంలో సదరు బాధితుడు తన వద్ద ఉన్న 50 వేల వాన్ల (స్థానిక కరెన్సీ)ను వాషింగ్ మెషీన్‌లో వేసి శుభ్రం చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వాటిని అందులో వేసి కాస్తంత వాషింగ్ పౌడర్ పోసి స్విచ్చాన్ చేశాడు.

కాసేపటి తర్వాత చూస్తే నోట్లు మొత్తం ముద్దగా మారి, పిప్పిగా మారాయి. కొన్ని చినిగిపోయాయి. వాటిని చూసిన అతడికి గుండె ఆగినంత పనైంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 50 వేల వాన్లు. ఆ వెంటనే తేరుకుని వాటిని మూటకట్టి కేంద్ర బ్యాంకుకు పరిగెత్తి అధికారులను కలిసి విషయం వివరించాడు.  

నిబంధనల ప్రకారం పాత, చినిగిన నోట్ల స్థానంలో కొత్త వాటిని పొందే అవకాశం ఉంది. అయితే, పూర్తిగా పాడైన నోట్ల స్థానంలో కొత్తవాటిని పొందే అవకాశం లేదు. దీంతో పాక్షికంగా పాడైన నోట్లను లెక్కించి ఆ మేరకు 19 వేల వాన్లు అతడి చేతిలో పెట్టారు.  అతడికి భారీగానే నష్టం జరిగిందని అయితే, ఓదార్పు కోసమే ఆమాత్రమైనా ఇచ్చామని బ్యాంకు అధికారులు తెలిపారు. బాధితుడి పేరును ఇయాన్ అని తెలిపిన అధికారులు అంతకుమించిన వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు.

More Telugu News