Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి భారత్ లోనే నిర్మాణం జరుపుకుంటోందని తెలుసా?

  • జమ్మూకశ్మీర్ లో భారీ వంతెన నిర్మాణం
  • చీనాబ్ నదిపై వంతెన
  • బారాముల్లా, శ్రీనగర్ ప్రాంతాలను జమ్మూతో అనుసంధానం
Worlds highest railway bridge under construction on Chenab river

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన జమ్మూ కశ్మీర్ లో నిర్మాణం జరుపుకుంటోంది. ఈ వంతెన ద్వారా శ్రీనగర్, బారాముల్లా ప్రాంతాలు జమ్మూతో అనుసంధానం అవుతాయి. చీనాబ్ నదిపై నిర్మితమవుతున్న ఈ భారీ రైల్వే బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు. పారిస్ లో ఉన్న సుప్రసిద్ధ చారిత్రక కట్టడం ఈఫిల్ టవర్ (324 మీటర్లు) కంటే ఈ వంతెన ఎంతో ఎత్తయినది. ప్రపంచంలో ఈ స్థాయి వంతెన మరొకటి లేదు. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచినా చెక్కుచెదరని విధంగా అత్యంత పటిష్టంగా ఈ వారధి నిర్మాణం సాగుతోంది.

దీని పొడవు 1,315 మీటర్లు. పేలుళ్లు, భూకంపాలను తట్టుకునే విధంగా దీన్ని డిజైన్ చేశారు. ఈ వంతెనపై రైళ్లు గరిష్టంగా 100 కిమీ వేగంతో ప్రయాణించే వీలుంది. మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ సంకోచించని లోహాలను, పదార్థాలను దీని నిర్మాణంలో వినియోగించారు.

అంతేకాదు, ఈ ప్రాంతంలో గాలి వేగం 90 కిలోమీటర్లు దాటితే ఆటోమేటిగ్గా ఈ బ్రిడ్జిపై రెడ్ సిగ్నల్ లైట్ వెలుగుతుంది. ఈ బ్రిడ్జి రూపకల్పలో డీఆర్డీఓ పాత్ర కూడా ఉంది. ఈ వంతెనకు దన్నుగా నిలుస్తున్న 17 స్తంభాల్లో ఒక్కటి పడిపోయినా వంతెన దృఢంగా నిలిచే ఉండేలా డీఆర్డీఓ సూచనలు అందించింది. ఇది 2022 నాటికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

More Telugu News