Telangana: అమానవీయంగా ప్రవర్తిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వం కొరడా

  • కరోనా రోగుల విషయంలో ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదులు
  • ఆకస్మిక దాడుల కోసం బృందాలను రెడీ చేసిన ప్రభుత్వం
  • కార్పొరేట్ ఆసుపత్రుల తీరుపై మంత్రి ఈటల ఆగ్రహం
Telangana govt ready to act against private hospitals

కరోనా రోగుల విషయంలో అమానవీయంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల విషయంలో కొరడా ఝళిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. కరోనా చికిత్సకు అత్యధిక ఫీజులు వసూలు చేయడంతోపాటు మృతదేహాల అప్పగింత విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్న ఆసుపత్రుల అనుమతుల్ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఇలాంటి ఫిర్యాదులు వస్తున్న ఆసుపత్రులపై ఆకస్మిక దాడులు నిర్వహించి రికార్డులు పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనుంది.

ఆసుపత్రులపై దాడులకు సంబంధించి ఇప్పటికే కొన్ని బృందాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. రెండుమూడు రోజుల్లో ఇవి ఆసుపత్రులపై దాడులు చేయనున్నట్టు అధికార వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు తెలుస్తోంది. ఇటీవల ఓ ఆసుపత్రిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. అయితే, ఏమాత్రం కనికరం చూపని ఆసుపత్రి లక్షల ఫీజు చెల్లించాలంటూ పట్టుబట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తన దృష్టికి రావడంతో స్పందించిన మంత్రి కేటీఆర్ ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలంటూ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కోరారు. దీంతో వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఈటల ప్రైవేటు, కార్పొరేట్  ఆసుపత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా రోగుల విషయంలో అమానవీయంగా వ్యవహరించే ఆసుపత్రులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

More Telugu News