Maruti 800: మారుతికి కలిసొచ్చిన ఆ మోడల్ కారు మళ్లీ వస్తోందా..?

  • 80వ దశకంలో ఓ ఊపు ఊపిన మారుతి 800 కారు
  • కొంతకాలం కిందట 800 ఉత్పత్తి నిలిపివేసిన మారుతి
  • ఆధునిక సౌకర్యాలతో త్వరలోనే సరికొత్త కారు!
Speculations raises as Maruti will be brought 800 model

భారత్ కార్ల విపణిలో ఎన్ని విదేశీ కంపెనీలు వచ్చినా దేశీయ దిగ్గజం మారుతికి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. జపాన్ ఆటోమొబైల్ సంస్థ సుజుకితో జట్టుకట్టిన మారుతి అనేక మోడళ్లతో దశాబ్దాల నుంచి వినియోగదారులను అలరిస్తోంది. మారుతికి భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మంచి మార్కెట్ ఉంది. అయితే, తొలినాళ్లలో మారుతి తయారు చేసిన 800 మోడల్ కారు మధ్యతరగతి ప్రజల కారుగా పేరు తెచ్చుకుంది. మారుతి పోర్ట్ ఫోలియోలో అత్యధిక అమ్మకాలు జరిపిన కారు కూడా ఇదేనంటే అతిశయోక్తి కాదు.

80వ దశకంలో మొదలైన మారుతి 800 కారు వైభవం 2000వ సంవత్సరం తర్వాత తగ్గిపోయింది. ఆల్టో మోడల్ ను అభివృద్ధి చేసిన మారుతి తన పాతకారుకు విశ్రాంతినిచ్చింది. అయితే, మారుతున్న వినియోగదారుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని 800 మోడల్ ను మారుతి మళ్లీ తెరపైకి తెస్తోందని ప్రచారం జరుగుతోంది. తక్కువ బడ్జెట్ లో కొన్ని మోడళ్లు తెస్తున్నామన్న మారుతి సుజుకి ప్రతినిధి మాటలే అందుకు నిదర్శనం.

ఇక ఈ కారు ధర రూ.3 లక్షల రేంజిలో ఉంటుందని, ధర తక్కువైనా ఇప్పుడున్న కాంపాక్ట్ కార్లలో ఉండే అన్ని సౌకర్యాలు దీంట్లో ఉంటాయని సమాచారం. ఎయిర్ బ్యాగులు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే ఇన్ఫోటైన్ మెంట్ తో వచ్చే కొత్త 800 కారు ఎలా ఉంటుందన్న దానిపై ఆటోమొబైల్ వర్గాలు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి!

More Telugu News