Amar Singh: దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన అమర్ సింగ్.. ఆయనే లేకపోతే అప్పటి యూపీఏ ప్రభుత్వం కూలిపోయేది!

  • ములాయంకు అత్యంత సన్నిహితుడు అమర్ సింగ్
  • జయప్రదను సమాజ్ వాదీ పార్టీలోకి తీసుకెళ్లింది ఆయనే
  • ఎన్నో పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా ఉన్న అమర్ సింగ్
Amar Singh played a key role in national politics

సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ సింగపూర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సింగపూర్ లో కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్న ఆయన ఆరు నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో కీలక నేతగా వ్యవహరించిన అమర్ సింగ్... దేశ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పారు. సమాజ్ వాదీ పార్టీకి గ్లామర్ ను తీసుకొచ్చిన వ్యక్తిగా అమర్ సింగ్ కు గుర్తింపు ఉంది. సినీనటి జయప్రదను సమాజ్ వాదీ పార్టీలోకి తీసుకెళ్లింది అమర్ సింగ్ కావడం గమనార్హం.

2008లో కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి, వామపక్షాలకు మధ్య అణు ఒప్పందం విషయంలో తేడాలు వచ్చాయి. దీంతో, యూపీఏకు వామపక్షాలు మద్దతును ఉపసంహరించుకున్నాయి. ఆ సమయంలో అమర్ సింగ్ అత్యంత కీలక పాత్రను పోషించారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన 39 మంది ఎంపీల మద్దతుతో యూపీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టారు. సమాజ్ వాదీ పార్టీలో ములాయం సింగ్ కు అత్యంత నమ్మకస్తుడిగా అమర్ సింగ్ ఉన్నారు. అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంగా 2010లో అమర్ సింగ్ తో పాటు, జయప్రదను కూడా పార్టీ నుంచి బహిష్కరించారు.

2011లో రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీని అమర్ సింగ్ స్థాపించారు. కానీ, ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అనంతరం 2014లో రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలో ఆయన చేరారు. ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ సొంతగూటికి దగ్గరైన ఆయన... సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో 2016లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. తన దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో పార్లమెంటరీ కమిటీల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు.

2013 నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన... ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల పార్టీలకు అతీతంగా జాతీయ స్థాయి నేతలంతా తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News