Pawan Kalyan: సైద్ధాంతిక నిబద్ధత కలిగిన ఒక నేతను కోల్పోయాం: మాణిక్యాలరావు మృతిపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు

  • మాణిక్యాలరావు కోలుకుంటారని భావించామన్న పవన్
  • పార్టీకి, ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచారని వెల్లడి
  • ఏపీ ప్రజలకు ఆయన మరణం ఒక లోటు అని వ్యాఖ్యలు
Pawan Kalyan responds on the demise of former minister and BJP leader Pydikondala Manikyalarao

కరోనా బారినపడి చికిత్స పొందుతూ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృత్యువాతపడడం ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర విచారం కలిగించింది. దీనిపై జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాణిక్యాలరావు తుదిశ్వాస విడిచారని తెలిసి విచారానికి లోనయ్యానని తెలిపారు.

 అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న మాణిక్యాలరావు కోలుకుంటారని భావించామని పేర్కొన్నారు. సైద్ధాంతిక నిబద్ధత కలిగిన ఒక నేతను కోల్పోయామని, పార్టీకి, ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచిన నాయకుడని వివరించారు. ఇటీవల తాడేపల్లిగూడెంలో జరిగిన కొన్ని సంఘటనల్లో జనసేన పార్టీ కార్యకర్తలకు మాణిక్యాలరావు అండగా నిలిచారని పవన్ గుర్తుచేసుకున్నారు. మాణిక్యాలరావు మరణం తాడేపల్లిగూడెం వాసులకే కాదని, ఏపీ ప్రజలందరికీ ఒక లోటు అని పేర్కొన్నారు.

More Telugu News