Andhra Pradesh: కరోనా వ్యాప్తిలో ఏపీ టాప్.. జూలైలో ఏకంగా 865 శాతం పెరిగిన పాజిటివ్ కేసులు!

  • జూన్ నెలాఖరుకు ఏపీలో కరోనా కేసులు 14,596 మాత్రమే
  • నెల వ్యవధిలోనే 1.26 లక్షలకు పెరిగిన పాజిటివ్ కేసులు
  • అత్యధిక కేసుల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్న ఏపీ
AP witnessed 865 percent rise in Corona cases in July

ఏపీలో కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తోంది. మృత్యు ఘంటికలు మోగిస్తోంది. జూలై నెలాఖరు వరకు ఏపీలో 1,26,337 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జూలై మాసంలో ఏకంగా 865 శాతం మేర కేసులు పెరిగాయంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇంత స్థాయిలో కేసులు పెరగలేదు. కేసుల పెరుగుదల శాతంలో మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలను ఏపీ అధిగమించింది.

జూన్ 30వ తేదీ నాటికి ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,596 మాత్రమే. కానీ, నెల వ్యవధిలోనే ఈ కేసుల సంఖ్య 1.26 లక్షలకు చేరింది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ప్రభంజనం మామూలుగా లేదు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన తూగో జిల్లాలో జూలై నెలలో కరోనా కేసులు ఏకంగా 1,800 శాతం ఎగబాకాయి.

నిన్న ఒక్క రోజే ఏపీలో ఏకంగా 10,376 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నిన్నటి వరకు మొత్తం కేసుల సంఖ్య 1,40,933కి పెరిగింది. ఇదే సమయంలో కరోనా వల్ల మరణాల సంఖ్య కూడా అమాంతం పెరుగుతోంది. మొత్తం 1,349 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కాసేపటి క్రితమే మాజీ మంత్రి మాణిక్యాలరావు కూడా కరోనాతో మృతి చెందారు.

అమాంతం పెరుగుతున్న కరోనా కేసులతో... దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో ఏపీ వడివడిగా పైకి ఎగబాకుతోంది. ఢిల్లీని కూడా అధిగమించి లిస్టులో మూడో స్థానానికి చేరుకుంది. ఎక్కువ కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు మాత్రమే ఏపీ కంటే ముందు ఉన్నాయి. పరిస్థితి మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే ఏపీ తొలి స్థానానికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

More Telugu News