పిల్లల చదువు కోసం.. తాళిని తాకట్టు పెట్టి టీవీ కొనుగోలు చేసిన మహిళ!

01-08-2020 Sat 08:13
  • పిల్లలు ఆన్‌లైన్ పాఠాలు వినలేకపోతున్నారని బెంగ
  • రూ. 20 వేలకు తాళిని తాకట్టుపెట్టిన మహిళ
  • విషయం తెలిసి స్పందించిన విద్యాశాఖ మంత్రి
Woman mortgages mangalsutra to buy TV for kids education
టీవీలో వస్తున్న ఆన్‌లైన్ పాఠాలను వినేందుకు టీవీ లేకపోవడంతో ఓ ఇల్లాలు తన తాళిని అమ్మి మరీ టీవీని కొనుగోలు చేసింది. కర్ణాటకలోని గదగ జిల్లా నరగుంద తాలూకా రెడ్డేర్ నాగనూరులో జరిగిందీ ఘటన. కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే ఆన్‌లైన్ పాఠాలు ప్రారంభించింది. అయితే, వాటిని వినేందుకు ఇంట్లో టీవీ లేకపోవడంతో కస్తూరి అనే మహిళ ఆవేదన చెందింది. తన ఇద్దరు పిల్లల భవిష్యత్తుపై బెంగపెట్టుకుంది.

ఇప్పటికిప్పుడు టీవీ కొనే స్తోమత లేదు. భర్త సంపాదన అంతంత మాత్రమే కావడంతో టీవీ కొనే దారి ఆమెకు కనిపించలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని భారతీయ మహిళ ఎంతో పవిత్రంగా భావించే తాళిని తాకట్టుపెట్టాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా తాళిని రూ. 20 వేలకు తాకట్టుపెట్టి టీవీ కొనుగోలు చేసి కనెక్షన్ పెట్టింది. ఫలితంగా పిల్లలు ఆన్‌లైన్ పాఠాలు వినేందుకు మార్గం సుగమమైంది.

పిల్లల భవిష్యత్తు కోసం తాళిని త్యాగం చేసిన కస్తూరి గురించి తెలిసిన మంత్రి సీసీ పాటిల్ స్పందించారు. ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. మరోవైపు, ఈ విషయం తెలిసిన గ్రామస్థులు సైతం ముందుకొచ్చి తోచినంత సాయం చేశారు.