Sushant Singh Rajput: సుశాంత్ కేసు సాకుతో రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టొద్దు: ఉద్ధవ్ థాకరే

Uddhav Thackeray defends Mumbai Police over Sushant Singh Rajput case
  • ప్రభుత్వం, పోలీసుల సమర్థతపై బీజేపీ నేతల ఆరోపణలు
  • ఖండించిన ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే
  • ఆధారాలుంటే సమర్పించాలని కోరిన సీఎం
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు సాకుతో మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టవద్దని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కోరారు. గత మూడు నాలుగు రోజులుగా సుశాంత్ ఆత్మహత్య కేసు వార్తల్లో నిలుస్తోంది. కేసును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడం, కేసును ముంబై పోలీసులే దర్యాప్తు చేస్తారని, సీబీఐకి అప్పగించే ఉద్దేశం తమకు లేదని ‘మహా’ ప్రభుత్వం చెప్పడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.

మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కేసులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు. కాగా, సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించి ముంబై, పాట్నాలలో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసును ఒకేచోట దర్యాప్తు చేయాలంటూ సుశాంత్ గాళ్ ఫ్రెండ్ అయిన రియా చక్రవర్తి తరపు న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుశాంత్ ఆత్మహత్య కేసు క్రమంగా రాజకీయ రంగు పులుముకుంటుండడంపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్పందించారు. ముంబై పోలీసులు ఎంతో సమర్థత కలిగిన వారని, వారి సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్న వారి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఎవరి వద్దనైనా ఆధారాలు ఉంటే తమకు సమర్పించవచ్చని, దోషులుగా తేలిన వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. అంతేకానీ, సుశాంత్ కేసు సాకుతో మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టవద్దని హితవు పలికారు.
Sushant Singh Rajput
Bollywood
Maharashtra
Bihar
Uddhav Thackeray

More Telugu News