Chandrababu: అన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వంపై పోరాటమే.. ఈ రోజు అమరావతి రైతులకు జరిగింది, రేపు అందరికీ జరుగుతుంది: చంద్రబాబు

  • ప్రజలు అసహ్యించుకునే పనులకు వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది
  • రాష్ట్రం పూర్తిగా అప్పులపాలైంది
  • భవిష్యత్ తరాల కోసం అందరూ పోరాటం చేయాలి
  • రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తే న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదు
  • నేను చేస్తున్న పోరాటం రాష్ట్రం కోసమే
Chandrababu calls people of AP to join together to protest against YSRCP govt

ఏపీకి కావాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణే కానీ... మూడు రాజధానులు కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ హయాంలో అన్ని రాష్ట్రాలను సమానంగా అభివృద్ది చేసేందుకు యత్నించామని చెప్పారు. ఎన్నో పరిశ్రమలను తీసుకొచ్చామని, ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించామని తెలిపారు. అభివృద్ధిని కొనసాగించాల్సింది పోయి... వైసీపీ ప్రభుత్వం దుర్మార్గమైన పనులు చేస్తోందని మండిపడ్డారు. ప్రజలు అసహ్యించుకునే చర్యలకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. అధికారం శాశ్వతం కాదని... మనం చేసే మంచి పనులే శాశ్వతమని చెప్పారు. హైదరాబాదులో ఐటీని, ఎయిర్ పోర్టును, ఔటర్ రింగ్ రోడ్డుని, సైబరాబాదుని డెవలప్ చేశామని... అవి తనకు ఎంతో తృప్తినిస్తాయని అన్నారు.

ఇప్పటికే రాష్ట్రం అప్పులపాలైందని... రాష్ట్రంలో అభివృద్ధే లేదని చంద్రబాబు మండిపడ్డారు. 14 నెలల వైసీపీ పాలనలో విపక్ష నేతలు, కార్యకర్తలపై దాడులు, కక్షసాధింపు చర్యలు, పోలీసు కేసులు తప్ప మరేమీ లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతులకు తాము ఒక నమ్మకాన్ని ఇచ్చామని... వారి నమ్మకాన్ని వీరు పూర్తిగా దెబ్బతీస్తున్నారని చెప్పారు. అమరావతిని తీసుకొచ్చింది చంద్రబాబు కాదని... గత ప్రభుత్వ ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తే న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వంపై చట్టపరంగా, న్యాయపరంగా పోరాడుతామని చంద్రబాబు హెచ్చరించారు. రాజధాని జేఏసీ పిలుపునందుకుని రెండు, మూడు రోజుల్లో అన్ని రాజకీయపార్టీలతో కలిసి... రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని చెప్పారు. ఇది తన కోసం చేస్తున్న పని కాదని... రాష్ట్రం కోసం, భావి తరాల కోసం చేస్తున్న పని అని ప్రజలంతా గుర్తుంచుకోవాలని తెలిపారు. ఈ రాష్ట్రం ఏమవుతోంది? రాష్ట్రంలో ఏం జరుగుతోంది? అనే విషయం రానున్న రోజుల్లో అందరికీ అర్థమవుతుందని చెప్పారు.

రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజా విసురుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. కరోనా కష్టాల్లో ఉన్న ప్రజానీకానికి వైసీపీ ప్రభుత్వం మరో షాకిచ్చే పరిస్థితికి వచ్చిందని అన్నారు. ప్రజలు తమ భవిష్యత్తును కాపాడుకోవడానికి ముందుకు రావాలని... మీ బాధ్యతను నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ బయటకు వచ్చి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయాలని చెప్పారు.

ఈరోజు అమరావతి రైతులకు అన్యాయం జరిగిందని... రేపు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అన్యాయం జరుగుతుందని అన్నారు. బాధ్యత లేని ప్రభుత్వం వల్ల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. మీ రాజధాని ఏది అని ఎవరైనా అడిగితే... మూడు రాజధానుల పేర్లు చెప్పలేక సిగ్గుపడే పరిస్థితి వద్దని అన్నారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు అందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.

More Telugu News