Bonda Uma: ఒక రాజధానినే ఏడ్వలేకపోతున్నారు... మూడు రాజధానులు కడతారా?: బోండా ఉమ

  • వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదంపై టీడీపీ అసంతృప్తి
  • ఈ బిల్లు కోర్టులో నిలబడదన్న బోండా ఉమ
  • అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళదామంటూ సవాల్
Bonda Uma slams YSRCP government on three capitals issue

శాసనమండలిలో తాము నిలువరించిన వికేంద్రీకరణ బిల్లును వైసీపీ సర్కారు గవర్నర్ కు పంపడం, గవర్నర్ ఇవాళ ఆమోదముద్ర వేయడంపై టీడీపీ నేత బోండా ఉమ స్పందించారు. గవర్నర్ సంతకం పెట్టిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లు న్యాయస్థానంలో నిలవవని స్పష్టం చేశారు. ఎందుకంటే ఈ విషయం కోర్టు పరిధిలో ఉందని అన్నారు. ఈ బిల్లులపై తమకు తెలియకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని హైకోర్టులో స్పష్టంగా చెప్పారని ఉమ వెల్లడించారు. కానీ ఈ బిల్లులను దొడ్డిదారిన గవర్నర్ కు పంపించి, ఆయనకు తప్పుడు సూచనలు చేసి ఆయన ఆమోదం పొందారని ఆరోపించారు. దీనిపై టీడీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

"జగన్ అధికారంలోకి వచ్చి 14 నెలలైంది. తన పాలనలో ఏంచేశారని అడుగుతున్నా. విశాఖపట్నానికి రూపాయి ఖర్చు పెట్టారా? ఉత్తరాంధ్రలో ఒక్క రోడ్డు వేశారా? రాయలసీమలో చిన్న నీటి ప్రాజెక్టు కానీ, ఒక్క భవనం కానీ కట్టారా? ఒక రాజధానిని ఏడవలేని ఈ ప్రభుత్వం, మూడు రాజధానులు కడుతుందా? రూ.10 వేల కోట్లతో వడ్డించిన విస్తరి లాంటి రాజధాని ఉంటే దాన్ని సద్వినియోగం చేసుకోలేక, కొత్త రాజధానులు కడతామని బయల్దేరడం తుగ్లక్ పాలనను తలపిస్తోంది!

అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం... ఇదంతా ఓ పథకం ప్రకారం కొన్ని శక్తులు కలిసి పనిచేస్తున్నాయి. ఏపీ ప్రజల జీవితాలతో ఆడుకున్న పార్టీల పరిస్థితి ఏమైందో గతంలో చూశాం. అందరికీ అనువైన అమరావతే రాష్ట్ర రాజధాని. మీ స్వార్థ ప్రయోజనాల కోసం రాజధాని మార్చుతూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించవద్దు. అయినాగానీ, మూడు రాజధానులు కావాలి అనుకుంటే అసెంబ్లీని రద్దు చేసి, మూడు రాజధానుల అంశం మీదే ఎన్నికలకు వెళదాం. అప్పుడు మీకు ప్రజలు పట్టం కడితే, మూడు రాజధానుల మీద ముందుకు వెళదాం" అంటూ బోండా ఉమ పేర్కొన్నారు.

More Telugu News