India: అదే జరిగితే... భారత్, చైనా రెండూ ఓడిపోయినట్టే: చైనా

  • ఇండియాతో ఎప్పుడూ సత్సంబంధాలనే కోరుకుంటాం
  • భారత్ కు చైనా వ్యూహాత్మక ముప్పు కాదు
  • వ్యాపార బంధాలను తెంచుకుంటే ఇరు దేశాలు ఓడిపోయినట్టే
We always want good relations with India says China

భారత్ తో తాము ఎప్పుడూ స్నేహాన్ని, సత్సంబంధాలనే కోరుకుంటామని ఇండియాలో చైనా రాయబారి వేడాంగ్ చెప్పారు. భారత్ కు చైనా ఎప్పుడూ వ్యూహాత్మక ముప్పు కాదని అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కొన్ని కీలక అంశాల్లో ఇరు దేశాల మధ్య స్పష్టమైన అవగాహన రావాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న తాత్కాలిక విభేదాలు, వివాదాలను బూచిగా చూపి వేల సంవత్సరాలుగా ఉన్న సత్సంబంధాల చరిత్రను మరవడం సరికాదని అన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారే ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద ప్రమాదమని చెప్పారు.

రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకదానితో మరొకటి పెనవేసుకుని ఉన్నాయని... ఈ వ్యాపార బంధాలను బలవంతంగా తుంచేసుకుంటే... అది రెండు దేశాలకు ఓటమిగా మిగిలిపోతుందని అన్నారు. గాల్వాన్ ఉద్రిక్తత తర్వాత పలు చైనా యాప్ లను ఇండియా రద్దు చేసింది. ఇదే సమయంలో చైనాకు సంబంధించిన పలు కాంట్రాక్టులను కూడా రద్దు చేసింది. ఈ నేపథ్యంలో, ఆయన పైమేరకు స్పందించారు. ఏ దేశ అంతర్గత వ్యవహారాల్లోనూ చైనా జోక్యం చేసుకోదని... ఇదే సమయంలో తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవద్దని కూడా కోరుతున్నామని చెప్పారు. హాంకాంగ్, తైవాన్, షింజియాంగ్ తదితర అంశాలు తమ అంతర్గత వ్యవహారాలని తెలిపారు.

More Telugu News