Gold: బంగారానికి భారీగా పడిపోయిన డిమాండ్: ప్రపంచ పసిడి మండలి

gold demand falls 70 percent in april june quarter
  • ప్రభావం చూపిన లాక్‌డౌన్, అధిక ధరలు
  • రికార్డు స్థాయిలో క్షీణించిన దిగుమతులు
  • 74 శాతం తగ్గిన ఆభరణాల డిమాండ్ పరిమాణం
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశంలో విధించిన లాక్‌డౌన్, అధిక ధరలు వంటి కారణాలతో దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ 70 శాతం పడిపోయినట్టు ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. ఈ మేరకు ‘క్యూ2 బంగారం డిమాండ్ ట్రెండ్స్’ పేరుతో నివేదికను విడుదల చేసింది.

దీని ప్రకారం.. గతేడాది (2019) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ 213. 2 టన్నులు ఉండగా, ఈ ఏడాది అదే త్రైమాసికంలో అది 63.7 టన్నులకు పడిపోయింది. అదే సమయంలో డిమాండ్ విలువ ఏకంగా 57 శాతం పతనమై రూ. 62,420 కోట్ల నుంచి రూ. 26,600 కోట్లకు పడిపోయింది. ఆభరణాల డిమాండ్ పరిమాణంలో 74 శాతం తగ్గి 168.6 టన్నుల నుంచి ఏకంగా 44 టన్నులకు క్షీణించింది. విలువ 63 శాతం క్షీణించి  రూ.49,380 కోట్ల నుంచి రూ. 18,350 కోట్లకు పడిపోయింది.

పెట్టుబడుల పరిమాణం డిమాండ్‌లో 56 శాతం, విలువలో 37 క్షీణించింది. రీసైకిల్డ్ పరిమాణం కూడా 64 శాతం క్షీణించింది. ఇక దిగుమతులైతే రికార్డు స్థాయిలో 95 శాతం క్షీణించి 11.6 టన్నులకు పడిపోయాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో 56 శాతం పతనమై 165.6 టన్నులకు క్షీణించినట్టు డబ్ల్యూజీసీ నివేదిక వివరించింది. అంతర్జాతీయంగా కూడా డిమాండ్ పడిపోయినప్పటికీ పెట్టుబడులు మాత్రం భారీగా పెరిగినట్టు నివేదిక వివరించింది.
Gold
WGC
demand
business
Corona Virus
Lockdown

More Telugu News