Mumbai: ముంబై మురికివాడల్లో 57 శాతం మందికి కరోనా: తాజా అధ్యయనం

57 Persent of Slum People in Mumbai affected with Corona
  • 7 వేల రక్త నమూనాలపై పరీక్ష
  • అధ్యయనం వివరాలు వెల్లడించిన సీరోలాజికల్ సర్వైలెన్స్
  • పలువురి శరీరంలో వైరస్ ను ఎదుర్కొనే యాంటీ బాడీలు
  • గతంలో వైరస్ బారిన పడి ఉండటమే కారణమన్న అధ్యయనకర్తలు
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో ప్రతి ఆరుగురిలో ఒకరు కరోనా వైరస్ బారిన పడ్డారని, ఇక మురికివాడల్లో నివాసం ఉంటున్న లక్షలాది మందిలో 57 శాతం మందికి ఇప్పటికే వైరస్ సోకిందని సీరోలాజికల్ సర్వైలెన్స్ అధ్యయనం పేర్కొంది. నగరంలో నివాసం ఉంటున్న 7 వేల మంది నమూనాలను సేకరించిన అధ్యయన బృందం, వారి రక్తంలోని యాంటీ బాడీలపై పరీక్షలు జరిపి ఈ వాస్తవాన్ని వెలువరించింది. వీరిలో అత్యధికులు తమ శరీరంలోని యాంటీ బాడీల సాయంతో కరోనా లక్షణాలు బయట పడకుండా చేసుకున్నారని, గతంలో పలు రకాల వైరస్ ల బారిన పడివుండటం చాలా మందికి ఇప్పుడు ప్లస్ పాయింట్ గా మారిందని పరిశోధకులు వెల్లడించారు.

గతంలో వైరస్ బారిన పడిన వారిలో యాంటీ బాడీలు అభివృద్ధి చెందాయని, అవి ఇప్పుడు కరోనాను ఎదుర్కొంటున్నాయని తమ పరిశోధనలో వెల్లడైనట్టు సీరోలాజికల్ సర్వైలెన్స్ పేర్కొంది. కాగా, ముంబైలో కరోనా కేసులు లక్ష మార్క్ ను దాటిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇది దాదాపు 7 శాతానికి సమానం. ఇప్పటివరకూ 6 వేల మందికి పైగా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. నగరంలో సుమారు1.20 కోట్ల మంది నివాసం ఉంటుండగా, వీరిలో 65 శాతం మంది మురికి వాడల్లోనే ఉంటున్నారు.

ఈ అధ్యయనానికి నీతి ఆయోగ్, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ తమవంతు సహకారాన్ని అందించాయి. మూడు మునిసిపల్ వార్డుల్లో పర్యటించిన ఆరోగ్య కార్యకర్తలు శాంపిల్స్ సేకరించారు. కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీలు పురుషులతో పోలిస్తే మహిళలలో ఎక్కువగా ఉన్నాయని కూడా అధ్యయనం వెల్లడించింది. ఇదే విధమైన అధ్యయనాన్ని ఇటీవల ఢిల్లీలోనూ నిర్వహించగా, 23.48 శాతం మంది వైరస్ బారిన పడ్డట్టు తేలింది.

ఇదిలావుండగా, ముంబైలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. గడచిన రెండు నెలల కాలంలోనే తొలిసారిగా అతి తక్కువ కేసులు మంగళవారం నాడు నమోదయ్యాయి. నిన్న కేవలం 717 కేసులు మాత్రమే వచ్చాయని, మరో 55 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు.
Mumbai
Corona Virus
Slums
Positive
Antibodies

More Telugu News