రావి కొండలరావు మృతి పట్ల సీఎం జగన్, చంద్రబాబు సంతాపం

28-07-2020 Tue 19:20
  • గుండెపోటుతో సినీ నటుడు రావి కొండలరావు కన్నుమూత
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం జగన్
  • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్న చంద్రబాబు
CM Jagan and Chandrababu condolences to Ravi Kondalarao demise

నటుడిగా, రచయితగా, పాత్రికేయుడిగా అనేక విధాలుగా ప్రతిభను చాటుకున్న రావి కొండలరావు గుండెపోటుతో మరణించడం పట్ల ఏపీ సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలుగు సినీ ప్రముఖుడిగా, నాటక రచయితగా, నాటక ప్రయోక్తగా, జర్నలిస్టుగా ఆయన చెరగని ముద్రవేశారని కీర్తించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ కొనియాడారు. రావికొండలరావు మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.

అటు, విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రావి కొండలరావు మృతికి సంతాపం వ్యక్తం చేశారు. సీనియర్ నటులు, రచయిత కళాప్రపూర్ణ రావి కొండలరావు మరణం విచారకరం అని ట్వీట్ చేశారు. తెలుగుదనం ఉట్టిపడే పాత్రల్లో హాస్యాన్ని జోడించి ఆయన ప్రదర్శించే నటన ఆహ్లాదకరంగా ఉండేదని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు.