ఇంటర్వ్యూ పూర్తయింది... జాబ్ లెటర్ కూడా పంపించేశాం: సాఫ్ట్ వేర్ శారద అంశంపై సోనూ సూద్

28-07-2020 Tue 19:06
  • అందరి దృష్టి ఆకర్షించిన సాఫ్ట్ వేర్ శారద
  • తన ప్రతినిధులతో శారదను సంప్రదించిన సోనూ
  • కష్టాల్లో ఉన్నవారికి ఆశాకిరణంలా మారిన బాలీవుడ్ నటుడు
Sonu Sood says sent a job letter to Warangal girl software Sharada

ఇటీవల మీడియాలో, సోషల్ మీడియాలో వరంగల్ అమ్మాయి సాఫ్ట్ వేర్ శారద గురించి అనేక కథనాలు వచ్చాయి. లాక్ డౌన్ కారణంగా ఆమె ఉద్యోగం పోవడంతో, బతికేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయంటూ కూరగాయలు విక్రయిస్తూ ఉపాధి పొందడం వైరల్ అయింది. ఈ విషయం బాలీవుడ్ నటుడు సోనూ సూద్ వరకు వెళ్లింది. దాంతో ఆయన వెంటనే స్పందించి తన ప్రతినిధుల సాయంతో సాఫ్ట్ వేర్ శారద వివరాలు కనుక్కున్నారు. ఆమె ఆత్మస్థైర్యానికి మెచ్చిన సోనూ వెంటనే తమ ప్రతినిధి ద్వారా ఆమెను సంప్రదించారు.

ఆ తర్వాత జరిగిన పరిణామాలను సోనూ ట్విట్టర్ లో పంచుకున్నారు. "మా ప్రతినిధి ఆమెను కలిశారు. ఇంటర్వ్యూ పూర్తయింది. ఉద్యోగ నియామక పత్రం కూడా పంపించేశాం... జైహింద్" అంటూ ట్వీట్ చేశారు. ఏదేమైనా సోనూ సూద్ ఒక వర్గానికే కాకుండా అన్ని రంగాల్లోనూ కష్టాల్లో ఉన్న వాళ్లను ఆపద్బాంధవుడిలా ఆదుకుంటూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు.