కరోనా కలిపింది ఇద్దరినీ.. పెళ్లితో ఒకటైన జంట!

28-07-2020 Tue 14:32
  • కరోనాతో ఆసుపత్రిలో చేరిన యువకుడు, యువతి
  • ఇద్దరి మధ్య పుట్టిన ప్రేమ
  • పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న వైనం
Couple suffered with corona got love marriage
కరోనా దెబ్బకు చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రాణభయంతో కూడా వణికిపోతున్నారు. కానీ, ఈ ఇద్దరు మాత్రం ఎంతో హ్యాపీగా ఉన్నారు. కరోనా కారణంగా వీరిద్దరూ జీవిత భాగస్వాములు అయ్యారు. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ 'లవ్ ఇన్ క్వారంటైన్' స్టోరీ వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రకాశం జిల్లా పర్చూరు ప్రాంతానికి చెందిన యువకుడు, గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన యువతికి కరోనా సోకింది. దీంతో వీరిద్దరూ గుంటూరులోని ఓ కొర్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో ఇద్దరి బెడ్లు పక్కపక్కనే ఉన్నాయి. దీంతో, తొలుత మాటలు కలిశాయి. ఆ తర్వాత మనసులు కలిశాయి. చికిత్స సమయంలో ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కరోనా నుంచి కోలుకున్నారు. ఇద్దరికీ నెగెటివ్ రావడంతో... ఆసుపత్రి నుంచి వారు డిశ్చార్జ్ అయ్యారు.

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత తమ ప్రేమ గురించి వారి తల్లిదండ్రులకు చెప్పారు. అబ్బాయి హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. అమ్మాయి ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉంది. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం కావడంతో... ఇరువురి తల్లిదండ్రులు వారి పెళ్లికి అడ్డు చెప్పలేదు. దీంతో, వారిద్దరూ పెద్దల సమక్షంలో పొన్నూరులోని ఒక దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. అలా రెండు వారాల్లోనే వారి ప్రేమ కథ ప్రారంభమై, పెళ్లితో ముగిసింది.