కొత్త ఆశలు కల్పిస్తున్న గూగుల్ ఆన్ లైన్ సర్టిఫికెట్ కోర్సు

28-07-2020 Tue 14:08
  • ఆన్ లైన్ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్
  • ఎలాంటి డిగ్రీలు లేకపోయినా గూగుల్ కోర్సులో ప్రవేశం
  • అత్యధిక వేతనాలు పొందే అవకాశం
Google introduces online certificate course

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆన్ లైన్ కోర్సులకు, ఆన్ లైన్ క్లాసులకు డిమాండ్ పెరిగింది. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఇప్పటికే ఎన్నో ఆన్ లైన్ సర్టిఫికెట్ కోర్సులు, ఆన్ లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అందిస్తోంది. తాజాగా అత్యంత ప్రజాదరణ పొందిన ఐటీ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ గురించి గూగుల్ ట్విట్టర్ లో వెల్లడించింది. ఈ కోర్సులో చేరేందుకు ఎలాంటి కాలేజీ డిగ్రీలు అవసరంలేదు. ఈ సర్టిఫికెట్ కోర్సు చేసిన వాళ్లు తమదైన నైపుణ్యం ప్రదర్శించగలిగితే ఐటీ రంగంలో అత్యధిక వేతనాలతో ఉద్యోగాలు పొందే వీలుంటుంది.

గూగుల్ సంస్థ కోర్సెరా ప్లాట్ ఫాంపై ఈ సర్టిఫికెట్ కోర్సును నిర్వహిస్తోంది. ఈ కోర్సు సిలబస్ మొత్తం గూగుల్ నిపుణులే రూపొందించారు. కోర్సు కాల వ్యవధి 6 నెలలు. ఈ కోర్సులో చేరదలిచిన వారికి పూర్వ అనుభవం ఏమీ అక్కర్లేదు. ఎంపికైన క్యాండిడేట్లకు గూగుల్ స్టయిపెండ్లు, స్కాలర్షిప్పులు కూడా అందిస్తుంది. ఓ విద్యార్థికి సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత కూడా తమ మద్దతు కొనసాగుతుందని, అతని సమాచారాన్ని ఉన్నతస్థాయి సంస్థలకు బదలాయించే వీలుంటుందని గూగుల్ పేర్కొంది. ఇతర వివరాలకు ట్విట్టర్ లో గూగుల్ ఖాతాను సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు.