Vishnu Kumar Raju: విశాఖపట్నం నిస్సహాయ స్థితికి చేరుకుంది: విష్ణుకుమార్ రాజు

  • కరోనాను జగన్ లైట్ గా తీసుకుంటున్నారు
  • నెల రోజుల్లో విశాఖలో కేసుల సంఖ్య 50 వేలకు పెరుగుతుంది
  • విశాఖలో 10 రోజుల లాక్ డౌన్ విధించాలి
Vizag reached to a helpless stage says Vishnu Kumar Raju

కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు విమర్శించారు. కరోనా వైరస్ ను ముఖ్యమంత్రి జగన్ చాలా లైట్ గా తీసుకుంటున్నారని అన్నారు. కరోనాతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, ఆసుపత్రుల్లో సదుపాయాలు వంటి వాటిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను చూపించాల్సి ఉందని అన్నారు.

విశాఖలో కరోనా కేసులు అమాంతం పెరిగిపోతున్నాయని విష్ణు రాజు చెప్పారు. నగరం నిస్సహాయ స్థితికి చేరుకుందని అన్నారు. మరో నెల రోజుల్లో విశాఖలో కరోనా కేసులు 50 వేలకు చేరుకుంటాయనే అంచనాలు ఉన్నాయని చెప్పారు. పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకురావాలంటే... కనీసం 10 రోజుల పాటు నగరంలో లాక్ డౌన్ విధించాల్సిన అవసరం ఉందని అన్నారు. విశాఖలో అన్ని పార్టీల నేతలతో మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు.

కరోనా టెస్టుల రిపోర్టులు ఎన్ని రోజుల్లో వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఉందని విష్ణు రాజు విమర్శించారు. 108కి ఫోన్ చేసినా అంబులెన్సులు వస్తాయనే నమ్మకం లేదని... అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. కరోనా పేషెంట్ ను ఇంటికి పంపించే ముందు టెస్ట్ చేయడం లేదని ఆరోపించారు.

More Telugu News