Congress: రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు మాతో టచ్‌లోనే ఉన్నారు: కాంగ్రెస్ నేత అవినాశ్ పాండే

  • సమస్యల పరిష్కారానికి గాంధేయ, శాంతియుత పద్ధతులు అవలంబిస్తాం
  • గత 70 ఏళ్లలో ఏ గవర్నరూ ఇలా వ్యవహరించలేదు
  • ఎమ్మెల్యేలు తప్పును అంగీకరిస్తే అధిష్ఠానం వారి సమస్యలను పరిష్కరిస్తుంది
sachin pilot MLAs are in touch with us says avinash pandey

రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఓ వైపు పైలట్ వర్గం బెట్టువీడకపోగా, మరోవైపు అసెంబ్లీని సమావేశపరిచే విషయంలో గవర్నర్ కల్రాజ్ మిశ్రా ఏ నిర్ణయమూ వెల్లడించలేదు. దీంతో రాష్ట్రంలో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది.

రాజస్థాన్‌లోని తాజా పరిస్థితులపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ అవినాశ్ పాండే మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్ఠంభనను పరిష్కరిస్తామన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పైలట్ వర్గంలోని 19 మంది రెబల్ ఎమ్మెల్యేలలో చాలామంది తమతో టచ్‌లో ఉన్నారని, తమతో సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కోసం ప్రజాస్వామ్యంలో ఉన్న అన్ని గాంధేయ, శాంతియుత పద్ధతులను ఉపయోస్తామని స్పష్టం చేశారు.

అసెంబ్లీని సమావేశ పరచాలని గెహ్లాట్ ప్రభుత్వం కోరుతున్నప్పటికీ గవర్నర్ కల్రాజ్ మిశ్రా స్పందించడం లేదని పాండే అన్నారు. తమకు బలమున్నప్పటికీ అసెంబ్లీని సమావేశపరచకుండా గవర్నర్ మోకాలడ్డడం గత 70 ఏళ్లలో ఎన్నడూ జరగలేదని అన్నారు. అవసరమనుకుంటే సీఎం గెహ్లాట్ ప్రజాప్రతినిధులందరితో కలిసి రాష్ట్రపతిని కలుస్తారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని అన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ తప్పులను అంగీకరించి క్షమాపణ చెబితే, కాంగ్రెస్ హైకమాండ్ వారిని గౌరవించి సమస్యలు పరిష్కరిస్తుందని పాండే స్పష్టం చేశారు.

More Telugu News