WHO: కరోనా పరిస్థితులను మరోసారి సమీక్షించేందుకు సమాయత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ

  • ఇప్పటివరకు 1.6 కోట్ల పాజిటివ్ కేసులు
  • అమెరికా, భారత్, బ్రెజిల్ లో కరోనా విలయం
  • స్పెయిన్, బెల్జియం, హాంకాంగ్ లో మళ్లీ విజృంభిస్తున్న వైరస్
WHO declared most severed emergency as corona scares

ప్రపంచవ్యాప్తంగా నిత్యం లక్షల సంఖ్యలో కరోనా కేసులు వెల్లడవుతుండడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై అత్యంత తీవ్ర ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ... ప్రపంచవ్యాప్త కరోనా కేసుల సంఖ్య 1.6 కోట్లు దాటిన నేపథ్యంలో మరోసారి సమీక్షకు సిద్ధమైంది.

డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథనోమ్ ఘెబ్రీసియస్ మాట్లాడుతూ, కరోనా కేసుల సంఖ్య ఆరు వారాల్లోనే రెట్టింపు కావడం కరోనా వైరస్ వ్యాప్తి వేగాన్ని సూచిస్తోందని అన్నారు. స్పెయిన్, బెల్జియం, హాంకాంగ్ వంటి దేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తోందని, ఇప్పుడక్కడ సెకండ్ వేవ్ కనిపిస్తోందని తెలిపారు. అయితే మరణాల సంఖ్య మాత్రం వారానికి 30 వేల నుంచి 40 వేల వరకు నమోదవుతుండడంలో పెద్దగా మార్పేమీ లేదని అభిప్రాయపడ్డారు.

అయితే, ప్రతి ఆర్నెల్లకోసారి ఎమర్జెన్సీ నిర్ణయాన్ని సమీక్షించాల్సి ఉన్నందున, డబ్ల్యూహెచ్ఓ అత్యవసర వ్యవహారాల కమిటీ భేటీ అయ్యేందుకు సిద్ధంగా ఉందని టెడ్రోస్ పేర్కొన్నారు.  ప్రపంచవ్యాప్తంగా కేవలం 4 రోజుల్లో 10 లక్షలు కేసులు వచ్చాయని, అమెరికా, భారత్, బ్రెజిల్ వంటి దేశాల్లో రోజుకు వేల సంఖ్యలో కొత్త కేసులు వస్తుండడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు.

More Telugu News