ఐపీఎల్ కు ఆతిథ్యం ఇవ్వాలని కోరుతూ యూఏఈ ప్రభుత్వానికి బీసీసీఐ లేఖ

27-07-2020 Mon 17:05
  • సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్
  • యూఏఈ ఆతిథ్యం!
  • భారత ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ కోసం చూస్తున్న యూఏఈ వర్గాలు
BCCI writes to UAE authorities seeking formal permission for IPL

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్ లో నిర్వహించాల్సిన ఐపీఎల్ తాజా సీజన్ వాయిదా పడడం తెలిసిందే. ఇప్పుడీ లీగ్ పోటీలను యూఏఈ వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో ఐపీఎల్ పోటీలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ యూఏఈ ప్రభుత్వానికి బీసీసీఐ లేఖ రాసింది. భారత క్రికెట్ బోర్డు నుంచి లేఖ వచ్చినట్టు యూఏఈ వర్గాలు నిర్ధారించాయి.

తమకు అధికారిక లేఖ వచ్చిందని, అయితే భారత ప్రభుత్వం నుంచి తమకు నిరభ్యంతర పత్రం రావాల్సి ఉందని, ఆ తర్వాతే తమ నిర్ణయం వెల్లడిస్తామని యూఏఈ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కార్యదర్శి ముబాష్షీర్ ఉస్మాని ఓ ప్రకటన విడుదల చేశారు. ఐపీఎల్ కు ఆతిథ్యం ఇచ్చే విషయంలో అనేక అంశాలు ప్రభావం చూపిస్తాయని, ఇది అనేకమందితో కూడిన భారీ వ్యవహారం అని ఉస్మాని తెలిపారు. అబుదాబి, దుబాయ్, షార్జా క్రీడా సంఘాలతోనూ, టూరిజం విభాగాలతోనూ చర్చించాల్సి ఉందని పేర్కొన్నారు.

అదేవిధంగా, పోలీసు వ్యవస్థలతోనూ, ముఖ్యంగా యూఏఈ ఆరోగ్య శాఖతోనూ దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని, అయితే, పైన పేర్కొన్న వ్యవస్థలన్నింటికీ భారీ కార్యక్రమాల నిర్వహణలో తిరుగులేని అనుభవం ఉందని ఉస్మాని వివరించారు. తద్వారా ఐపీఎల్ ఆతిథ్యానికి తమ నుంచి ఎలాంటి అభ్యంతరంలేదని స్పష్టం చేశారు. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఐపీఎల్ పోటీలు విదేశీ గడ్డపై నిర్వహిస్తామని బీసీసీఐ ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సమాచారం అందించింది. దాంతో ఫ్రాంచైజీలన్నీ సన్నాహాలు షురూ చేశాయి. కాస్త ముందుగానే యూఏఈ వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి.