Gold: బంగారం ధరలో మరో ఆల్ టైమ్ హై... రూ.3,500కు పైగా పెరిగిన కిలో వెండి ధర!

  • రూ. 51,833కు బంగారం ధర
  • రూ. 64,896కు కిలో వెండి ధర
  • అంతర్జాతీయ మార్కెట్లోనూ రికార్డు
Another Record in Gold Price

విలువైన లోహాల ధరలు భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో నేటి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ మార్కెట్ లో బంగారం ధర మరో ఆల్ టైమ్ రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఇండియాలో వివాహాది శుభకార్యాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో కొనుగోళ్లు సైతం ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో శుక్రవారం నాటి ముగింపు రూ. 51,035తో పోలిస్తే, ఈ ఉదయం పది గ్రాముల బంగారం ధర మరో రూ. 714 పెరిగి రూ. 51,833కు చేరింది. ఇదే సమయంలో వెండి ధర రూ. 3,673 రూపాయలు పెరిగి రూ. 64,896కు చేరింది. దీంతో కేవలం వారం రోజుల వ్యవధిలోనే వెండి ధర 15 శాతానికి పైగా పెరిగినట్లయింది.

ఇక అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే, ఈ ఉదయం ఆసియా మార్కెట్లో ఔన్సు బంగారం ధర 40 డాలర్లు పెరిగి 1,937.50 డాలర్లకు చేరి కొత్త రికార్డును నెలకొల్పింది. యూఎస్, చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలతో డాలర్ ఇండెక్స్ రెండేళ్ల కనిష్ఠానికి పడిపోగా, బులియన్ మార్కెట్ వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారు. దీనికితోడు నష్టపోయిన అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనగా మరోమారు సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న వార్తలు బులియన్ పరుగులకు కారణమయ్యాయని విశ్లేషించారు.

More Telugu News