స్టూడియో అద్దె కట్టలేక రూ. 2 కోట్లు నష్టపోయిన కల్యాణ్ రామ్ సినిమా నిర్మాతలు!

27-07-2020 Mon 10:08
  • కల్యాణ్ రామ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మూవీ
  • రెండు కోట్ల రూపాయలతో భారీ సెట్ వేసిన నిర్మాతలు
  • షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియక సెట్ తీసివేత
Expensive Set Removed By Kalyaan Ram New Movie Set

కరోనా వ్యాప్తి నేపథ్యంలో షూటింగ్స్ ఆగిపోవడం, సినిమా హాల్స్ మూతపడటం, తిరిగి పని ఎప్పుడు మొదలవుతుందో తెలియకపోవడంతో నిర్మాతల నుంచి టెక్నీషియన్స్, నటీనటులు, సహాయక సిబ్బంది తదితర 24 క్రాఫ్ట్స్ విభాగాలన్నీ నష్టపోయాయి.

తాజాగా కల్యాణ్ రామ్ సినిమా కోసం రూ. 2 కోట్లతో వేసిన ఓ భారీ సెట్ ను స్టూడియో అద్దెను కట్టలేక నిర్మాతలు తొలగించాల్సి వచ్చిందట. కల్యాణ్ రామ్ హీరోగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ డ్రామా తెరకెక్కుతుండగా, దీనికి 'రావణ్' అన్న పేరు పరిశీలనలో ఉంది. ఈ చిత్రం కోసం రెండు కోట్లతో ఓ సెట్ ను నిర్మించారు. అందులో కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ఆపై లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోగా, కొంతకాలం పాటు వేచి చూసిన నిర్మాతలు, తిరిగి షూటింగ్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొన్న వేళ, దాన్ని తొలగించారని తెలుస్తోంది.