Osmania: పై తరగతికి ప్రమోట్ అయినా సరే... పరీక్షలు రాయాల్సిందేనంటున్న తెలంగాణ వర్శిటీలు!

  • కరోనా నేపథ్యంలో పరీక్షలన్నీ రద్దు
  • అయినా నిర్వహిస్తామంటున్న జేఎన్టీయూ, ఉస్మానియా
  • క్రెడిట్ డిటెన్షన్ ఇవ్వబోమని స్పష్టీకరణ
Telangana Versities to Conduct Exams for Pramoted Students

కరోనా మహమ్మారి నేపథ్యంలో, అన్ని రకాల పరీక్షలు వాయిదా పడగా, గత విద్యాసంవత్సరంలో విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారిలో ఫైనలియర్ పరీక్షలు మాత్రం జరుగుతాయని ఇప్పటికే స్పష్టం కాగా, మిగతా సంవత్సరాల విద్యార్థులు పై తరగతులకు ప్రమోట్ అయినప్పటికీ, వారంతా పరీక్షలు రాయాల్సి వుంటుందని ఉస్మానియా, జేఎన్టీయూ తదితర తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో విద్యార్థుల్లో తీవ్ర అయోమయం నెలకొంది.

తెలంగాణ ప్రభుత్వం ఫైనలియర్ విద్యార్థులు మినహా మిగతా అందరినీ పై తరగతులకు ప్రమోట్ చేయాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, వర్శిటీలు మాత్రం పరీక్షల విషయంలో రెండు ఆప్షన్లు ఇస్తున్నాయి. ఫైనలియర్ పరీక్షలు ముగిశాక, మిగతా పరీక్షలను నిర్వహిస్తామని అంటున్నాయి. రెండో ఆప్షన్ గా, విద్యా సంవత్సరం మధ్యలో ఎప్పుడైనా పరీక్షలు పెడతామని చెబుతున్నాయి. ఈ రెండు విధానాల్లో ఏదో ఒకదాన్ని అమలు చేస్తామని, అయితే, ఉన్నత విద్యా మండలి ఆదేశాల ప్రకారమే నిర్ణయం ఉంటుందని వెల్లడించాయి.

కాగా, ఆగస్టు నుంచి వర్శిటీల పరిధిలో ఆన్ లైన్ క్లాసులు, ఆపై పరిస్థితి చక్కబడిన తరువాత ప్రత్యక్ష క్లాసులను ప్రారంభించాలని యోచిస్తున్నాయి. అయితే సెమిస్టర్ ప్రారంభించిన తరువాత, అంతకుముందు సంవత్సరానికి సంబంధించిన పరీక్షలను విద్యార్థులు రాయాల్సి వుంటుందని జేఎన్టీయూ, ఉస్మానియా ఉన్నతాధికారులు అంటున్నారు. నవంబర్ లేదా డిసెంబర్ లో పరీక్షలు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పై తరగతులకు ప్రమోట్ అయ్యే విద్యార్థులకు ఈ దఫా క్రెడిట్ డిటెన్షన్ ఉండబోదని స్పష్టం చేస్తున్నారు.

More Telugu News