Bharat Biotech: భారత్ బయోటెక్ 'కోవాక్సిన్' ట్రయల్స్... తొలి శుభవార్త!

  • ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి
  • రెండో దశ ట్రయల్స్ కూడా ప్రారంభించాం
  • వెల్లడించిన రోహ్ తక్ పీజీ ఐఎంఎస్
Covaxin First Phase Trails Encouraging

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, పుణె వైరాలజీ ల్యాబ్స్ సంయుక్తంగా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ 'కోవాక్సిన్' తొలి దశ ట్రయల్స్ నిర్వహించిన రోహ్ తక్ పీజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఈ ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ కు ట్రయల్స్ నిర్వహించేందుకు మొత్తం 12 ఇనిస్టిట్యూట్ లకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ వారం ప్రారంభంలో ఢిల్లీ ఎయిమ్స్  లో సైతం 30 సంవత్సరాల యువకుడికి తొలి దశ వ్యాక్సిన్ ను ఇచ్చిన సంగతి తెలిసిందే. కోవాక్సిన్ తో పాటు జైడస్ కాడిలా సైతం హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభించేందుకు అనుమతులు పొందిందన్న సంగతి తెలిసిందే. కోవాక్సిన్ ను మృత కరోనా వైరస్ కణాలతో రూపొందించారు. ఈ వ్యాక్సిన్ ను నియమిత డోస్ లో ఇస్తే, శరీరంలో కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీలు తయారవుతాయని, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లూ ఉండబోవని సైంటిస్టులు ఇప్పటికే ప్రకటించారు.

ఇదిలావుండగా, రోహ్ తక్ పీజీఐఎంఎస్ లో తొలి దశ ట్రయల్స్ జూలై 17న ప్రారంభమయ్యాయి. మొత్తం 50 మంది వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చామని, ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఇనిస్టిట్యూట్ కు చెందిన డాక్టర్ సవితా వర్మ వెల్లడించారు. రెండో దశ ట్రయల్స్ లో భాగంగా ఆరుగురికి వ్యాక్సిన్ ఇచ్చామని అన్నారు. పాట్నా ఎయిమ్స్ లో సైతం 9 మంది వలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చారు.

More Telugu News