కరోనా వైరస్ ఎఫెక్ట్.. తమిళనాడులో తెరపైకి రాజధాని మార్పు ప్రతిపాదన!

27-07-2020 Mon 09:00
  • తిరుచ్చిని తమిళనాడుకు రెండో రాజధానిని చేయాలని తహతహలాడిన ఎంజీఆర్
  • శాటిలైట్ సిటీని అభివృద్ది చేయాలని కలలు గన్న కరుణానిధి
  • అదే జరిగి ఉంటే 90 వేల మంది కరోనా కోరల నుంచి బయటపడేవారంటున్న నిపుణులు
Capital city change proposal once again talk of the town in Tamil Nadu

తమిళనాడు రాజధానిని చెన్నై నుంచి మరో చోటుకి మార్చాలంటూ మూడు దశబ్దాల క్రితం చేసిన ప్రయత్నాలు ఆ తర్వాత తెరమరుగవగా.. తాజాగా మళ్లీ ఆ చర్చ తెరపైకి వచ్చింది. చెన్నైకి బదులుగా తిరుచ్చిని తమిళనాడుకు రెండో రాజధానిగా మార్చాలని 1982లో అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ ప్రయత్నించారు.

ఆ తర్వాత చెన్నైలో జనసాంద్రతను తగ్గించేందుకు సబర్బన్ ప్రాంతాలను కలుపుకుని శాటిలైట్ నగరాన్ని అభివృద్ధి చేయాలని డీఎంకే చీఫ్ కరుణానిధి ప్రయత్నించారు. అయితే, ఈ రెండు ప్రయత్నాలపైనా విమర్శలు వెల్లువెత్తడంతో అక్కడితో ఆ ఆలోచనలకు ఫుల్‌స్టాప్ పడింది. ఎంజీఆర్ ప్రయత్నాలు కనుక ఫలించి ఉంటే నావల్‌పట్టు ప్రాంతం ప్రస్తుతం తమిళనాడు రాజధానిగా ఉండేది.

ప్రస్తుతం కరోనా బారినపడి రాజధాని చెన్నై అతలాకుతలం అవుతుండడంతో మళ్లీ రాజధాని మార్పు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఎంజీఆర్ ప్రతిపాదించినట్టుగా తిరుచ్చిని రాజధానిని చేసి ఉంటే కనుక 90 వేల మంది రాజధాని వాసులు కరోనా కోరల్లో చిక్కుకుని ఉండేవారు కాదని నిపుణలు చెబుతున్నారు.