అన్ లాక్-3 లో సినిమా హాళ్లకు ఓకే..?
- ఆగస్టు నుంచి మూడో దశ అన్ లాక్
- స్కూళ్లు, మెట్రోలకు మరికొంతకాలం మూతే!
- కఠిన నిబంధనలతో సినిమా థియేటర్లు, జిమ్ లకు అనుమతి
కేంద్ర వర్గాల సమాచారం ప్రకారం... భారీ స్థాయిలో సడలింపులకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. ఆగస్టు 1 నుంచి సినిమా థియేటర్ల పునఃప్రారంభం, జిమ్ లు తెరుచుకోవచ్చన్నది వీటిలో ప్రధానమైనది. అయితే, 50 శాతం సీట్లతో థియేటర్లు తెరిచేందుకు యాజమాన్యాలు సంసిద్ధత వ్యక్తం చేస్తుండగా, కేంద్రం మాత్రం 25 శాతం సీట్లకే అనుమతిస్తామని అంటోంది. అది కూడా అన్ని రకాల మార్గదర్శకాలు పాటిస్తూ, భౌతికదూరం నిబంధన కచ్చితంగా పాటించాలని స్పష్టం చేస్తోంది.
ఇక, స్కూళ్లు, మెట్రో రైళ్లు ఇప్పట్లో పునఃప్రారంభమయ్యేది కష్టమేననిపిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు ఇప్పటికీ మెరుగపడని నేపథ్యంలో స్కూళ్లను మూసివుంచడమే మేలని కేంద్రం భావిస్తోంది. కేంద్ర మానవ వనరుల శాఖ పాఠశాలలను తిరిగి తెరిచే విషయమై రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుంటామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఇటీవలే చెప్పారు. అయితే ఇప్పట్లో స్కూళ్లను తెరవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఏమాత్రం సుముఖంగా లేరని కేంద్రం చెబుతోంది.