వరంగల్ ఎంపీని కదిలించిన 'సాఫ్ట్ వేర్ శారద'

26-07-2020 Sun 17:07
  • లాక్ డౌన్ తో సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోల్పోయిన శారద
  • స్వగ్రామానికి వెళ్లి కూరగాయల వ్యాపారం
  • ఎందరికో ఆదర్శంగా నిలిచిందన్న ఎంపీ, మంత్రి
Warangal MP responds about an expelled software engineer story

కరోనా మహమ్మారి ప్రభావంతో జీవితాలే తల్లకిందులైపోతున్నాయి. నిన్నటిదాకా సాఫీగా సాగిన బతుకులు ఒక్కసారిగా సుడిగుండంలో చిక్కుకుంటున్నాయి. ఉద్యోగాలు కోల్పోయి, ఉపాధి లేక అనేకమంది అలమటిస్తున్నారు. అయితే, వేలల్లో జీతం అందుకుంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా ఎంతో గౌరవం పొందిన శారద అనే అమ్మాయి లాక్ డౌన్ నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయినా కూరగాయలు అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్న వైనం పలువురిని ఆకర్షించింది.

శారద స్వస్థలం వరంగల్. ఢిల్లీలో రెండేళ్లపాటు ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసిన శారద ఇటీవలే హైదరాబాదులోని మరో సంస్థలో చేరింది. అంతలోనే కరోనా వ్యాప్తి మొదలవడంతో చాలామంది ఉద్యోగుల తరహాలోనే శారద కూడా ఉద్యోగం కోల్పోయింది. కుటుంబానికి ఆసరాగా ఉన్న ఉద్యోగం పోయిందని నిరుత్సాహపడకుండా శారద తన స్వస్థలానికి చేరుకుని తలిదండ్రులకు సాయంగా కూరగాయలు అమ్ముతూ ఉపాధి కల్పించుకుంది. శారద కథనాన్ని ఓ తెలుగు దినపత్రిక ప్రముఖంగా ప్రచురించడంతో ఉపరాష్ట్రపతి కార్యాలయం నుంచి స్థానిక పార్టీల వరకు ప్రతి ఒక్కరూ స్పందించారు.

దీనిపై వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా మాట్లాడారు. ఆమె కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటామని, త్వరలోనే శారద కుటుంబాన్ని కలుస్తానని వెల్లడించారు. కష్టపడి పనిచేయాలన్నది శారద తత్వమని ఆమె చర్యల ద్వారా అర్థమవుతోందని పేర్కొన్నారు. అటు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా శారద కథనంపై వ్యాఖ్యానించారు. ప్రభుత్వ తరఫున ఆమెకు ఎలాంటి సాయం అందించవచ్చో పరిశీలిస్తామని అన్నారు. ఆమె కథనం తనను ఎంతగానో కదిలించిందని, ఆమె ఎందరికో ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.