జూబ్లీహిల్స్ లో టాలీవుడ్ ప్రముఖుల సందడి... మొక్కలు నాటిన చిరంజీవి, పవన్ కల్యాణ్

26-07-2020 Sun 15:44
  • గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొన్న మెగాబ్రదర్స్
  • ఎంపీ సంతోష్ ను అభినందించిన చిరంజీవి
  • చాతుర్మాస్య దీక్షా దుస్తుల్లో వచ్చిన పవన్ కల్యాణ్
Chiranjeevi and Pawan Kalyan participates in Green India Challenge

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా టాలీవుడ్ ప్రముఖులు ఇవాళ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ నరేంద్ర చౌదరి (ఎన్టీవీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, దర్శకులు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి తన అభిప్రాయాలు వెల్లడించారు.

వృక్షాలే ప్రాణవాయువు అందిస్తాయని, ఈ కరోనా కాలంలో ప్రాణవాయువుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. అలాంటి ప్రాణవాయువును అందించే మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అభినందనీయుడని కొనియాడారు. ఇక, ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ప్రధానాకర్షణగా నిలిచారు. ఆయన ప్రస్తుతం చాతుర్మాస్య దీక్షలో ఉన్నందున ఆధ్యాత్మికత ఉట్టిపడే దుస్తుల్లోనే ఈ కార్యక్రమానికి విచ్చేశారు.