గెహ్లాట్, పైలట్ లను కూర్చోబెట్టి టీ తాపించండి చాలు... సోనియా గాంధీకి మార్గరేట్ అల్వా సలహా!

26-07-2020 Sun 09:34
  • సోనియా కల్పించుకోవాల్సిన సమయం వచ్చింది
  • హై కమాండ్ లో యువతరానికి చోటివ్వాలి
  • లేకుంటే ఇలాంటి సమస్యలే ఉత్పన్నమవుతాయి
  • సోనియాను ఉద్దేశించి మార్గరెట్ అల్వా
Margaret Alva Suggetion to Sonia

రాజస్థాన్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై సోనియా గాంధీ కల్పించుకోవాల్సిన సమయం వచ్చిందని, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, తిరుగుబాటు నేత సచిన్ పైలట్ లను పిలిపించి, చాయ్ తాపించి, మాట్లాడితే సమస్య కొలిక్కి వచ్చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, సోనియా సన్నిహితురాలు మార్గరేట్ అల్వా సలహా ఇచ్చారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె, సమస్య మరింత జఠిలం కాకుండా చూసే శక్తి సోనియాకు ఉందని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో మార్పులు చేయాల్సిన సమయం వచ్చిందని, తరాన్ని మార్చాలని ఆమె వ్యాఖ్యానించారు. గెహ్లాట్, పైలట్ లను పిలిపించి, ముఖాముఖి మాట్లాడితే, టీ కప్పులో తుఫాన్ వంటి సంక్షోభం సులువుగా తొలగిపోతుందని మార్గరెట్ వ్యాఖ్యానించారు. ఇక యువతకు హై కమాండ్ లో అవకాశాలు కల్పించాలని, యువరక్తాన్ని నింపకుంటే ఇటువంటి సమస్యలే ఏర్పడతాయని ఆమె స్పష్టం చేశారు.

ఇది పార్టీలో ఓ అంతర్గత సమస్య మాత్రమేనని, అధిష్ఠానం జోక్యంతో ఇద్దరి మధ్యా ఉన్న అభిప్రాయ బేధాలు సమసిపోతాయని అన్నారు. వీరిలో ఎవరూ కూడా కాంగ్రెస్ ను వీడుతామని ఎన్నడూ వ్యాఖ్యానించలేదని, ఈ కారణంతో పార్టీ సంక్షోభం ఏర్పడిందని భావించడానికి వీల్లేదని అన్నారు.

ఇక ఆమె గవర్నర్ పైనా మండిపడ్డారు. తటస్థంగా ఉండాల్సిన గవర్నర్, ఓ పార్టీకి మద్దతుగా నిలవడం ఏంటని ప్రశ్నించారు. మెజారిటీ ఉన్న ప్రభుత్వాలు నిండు సభలో సమావేశం కావాలే తప్ప, రాజ్ భవన్ లో కాదని అన్నారు. ముఖ్యమంత్రే స్వయంగా బల నిరూపణకు సిద్ధమైతే అసెంబ్లీని ఎందుకు సమావేశపరచడం లేదని ప్రశ్నించారు.