Bengaluru: కరోనా సోకిన 3,338 మంది మిస్సింగ్... ఉరుకులు పెడుతున్న బెంగళూరు అధికారులు!

  • టెస్ట్ ల సమయంలో తప్పుడు ఫోన్ నంబర్
  • పాజిటివ్ వచ్చిందని తెలియగానే మాయం
  • వెతుకుతున్న బీబీఎంపీ సిబ్బంది
  • ఇకపై ఐడీ కార్డులు, మొబైల్ వెరిఫై తప్పనిసరి చేసిన ప్రభుత్వం
Above3000Corona Positive Cases Missing in Bengalore

కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో, వ్యాధి సోకిన 3,338 మంది ఎక్కడ ఉన్నారో తెలియకపోవడంతో అధికారులు వారిని ట్రేస్ చేసేందుకు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. దేశంలోనే ఐటీ రాజధానిగా పేరు తెచ్చుకున్న బెంగళూరులో 14 రోజుల క్రితం 16 వేలుగా ఉన్న కేసుల సంఖ్య ఇప్పుడు ఏకంగా 27 వేలను దాటేసింది.

మొత్తం కేసుల్లో సగానికి పైగా బెంగళూరులోనే నమోదై ఉన్నాయి. "కరోనా సోకిన తరువాత కనిపించకుండా పోయిన వారిలో కొందరిని పోలీసుల సాయంతో గుర్తించాం. ఇంకా, 3,338 మంది ఎక్కడ ఉన్నారో తెలియాల్సి వుంది. వారంతా తమ శాంపిల్స్ ఇచ్చే సమయంలో తప్పుడు మొబైల్ నంబర్లు ఇచ్చారు. అదే సమస్యగా మారింది" అని బీబీఎంపీ (బృహత్ బెంగళూరు మహానగర పాలికే) కమిషనర్ ఎన్ మంజునాథ ప్రసాద్ వ్యాఖ్యానించారు.

ఇక వారంతా బయట తిరుగుతున్నారా?లేక ముందు జాగ్రత్త చర్యగా స్వీయ క్వారంటైన్ ను పాటిస్తున్నారా? అన్న విషయం తమకు తెలియడం లేదని అధికారులు అంటున్నారు. వారు బయట తిరుగుతూనే ఉంటే, వైరస్ మరింతగా విస్తరిస్తుందని, వారిని ట్రేస్ చేసే విషయాన్ని తాము అత్యంత ప్రాదాన్యతాంశంగా పరిగణిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వత్ నారాయణ్ వ్యాఖ్యానించారు.

ఇకపై అనుమానితుల నుంచి నమూనాలు సేకరించే సమయంలో ప్రభుత్వం జారీ చేసిన ఐడీ కార్డుతో పాటు, మొబైల్ నంబర్లను వెరిఫై చేయాలని యడ్యూరప్ప సర్కారు ఆదేశించింది. కాగా, కర్ణాటకలో శనివారం నాడు 5 వేలకు పైగా కేసులు రాగా, మొత్తం కేసుల సంఖ్య 90 వేలను దాటింది.

More Telugu News