మెయిల్ ద్వారా వచ్చిన సందేశం... ఓ టీవీ జర్నలిస్టు విషయంలో నిజమైంది!

25-07-2020 Sat 21:51
  • మహిళా రిపోర్టర్ మెడపై కణితి
  • టీవీలో చూసి గుర్తించిన వీక్షకురాలు
  • మెయిల్ ద్వారా అప్రమత్తం చేసిన వైనం
Mail alerts tv journalist as she was diagnosed cancer

అమెరికాలో డబ్ల్యూఎఫ్ఎల్ఏ టీవీ చానల్లో రిపోర్టర్ గా పనిచేస్తున్న విక్టోరియో ప్రైస్ అనే అతివకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఇటీవలే ఆమెకు ఓ మెయిల్ వచ్చింది. ఓ గుర్తుతెలియని మహిళ నుంచి వచ్చిన ఆ మెయిల్ లో ఏమని ఉందంటే... "మీ మెడపై చిన్న కణితి ఉంది. నాకూ అలాంటిదే ఓ కణితి ఉంది. అది క్యాన్సర్ అని వైద్యపరీక్షల్లో తేలింది. మీరు కూడా త్వరగా పరీక్షలు చేయించుకోండి, మీ మెడపై ఉన్న కణితి క్యాన్సర్ కావొచ్చేమో!" అని ఆ మహిళ విక్టోరియా ప్రైస్ ను హెచ్చరించింది.

"మీరు టీవీలో రిపోర్టింగ్ చేస్తుండగా మీ మెడపై కణితి ఉన్నట్టు గుర్తించాను" అని సదరు మహిళ వెల్లడించింది. ఈ మెయిల్ చూసిన విక్టోరియో ప్రైస్ తీవ్ర ఆందోళనకు గురైంది. నేరుగా ఆసుపత్రికి వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకోగా, నిజంగానే అది క్యాన్సర్ కణితి అని తేలింది. ఈ విషయాన్ని విక్టోరియా ప్రైస్ స్వయంగా వెల్లడించింది. తన జీవితాన్ని కాపాడిన ఆ అపరిచిత మహిళకు కృతజ్ఞతలు తెలిపింది. కాగా, ఎల్లుండి ఆమెకు శస్త్రచికిత్స చేసి ఆ కణితిని తొలగించడానికి డాక్టర్లు ఏర్పాట్లు చేస్తున్నారట.