AR Rahman: బాలీవుడ్ లో నాకు వ్యతిరేకంగా ఓ గ్యాంగ్ కుట్ర చేస్తోంది: ఏఆర్ రెహమాన్

AR Rahman opines about nepotism in Bollywood
  • బాలీవుడ్ లో బంధుప్రీతిపై స్పందించిన రెహమాన్
  • సమయానికి ట్యూన్లు ఇవ్వడంటూ దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడి
  • దిల్ బేచారా దర్శకుడికి తనపై చాడీలు చెప్పారన్న రెహమాన్

భారతదేశ ఖ్యాతిని ఆస్కార్ యవనికపై రెపరెపలాడించిన సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ బాలీవుడ్ లో బంధుప్రీతి అంశంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ లో తనకు రావాల్సిన అవకాశాలను ఓ గ్యాంగ్ అడ్డుకుంటోందని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా పుకార్లు వ్యాపింపచేస్తూ, సినిమాలు తనవరకు రాకుండా చేస్తున్నారని వెల్లడించారు.

సకాలంలో బాణీలు ఇవ్వడంటూ తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి ఆ ముఠానే కారణమని అన్నారు. సుశాంత్ రాజ్ పుత్ 'దిల్ బేచారా' చిత్రం విషయంలోనూ అలాగే జరిగిందని, రెహమాన్ వద్దకు వెళ్లొద్దని ఆ చిత్ర దర్శకుడు ముఖేశ్ ఛాబ్రాకు పలువురు చెప్పారని, కానీ ఛాబ్రాకు 48 గంటల్లో 4 పాటలకు ట్యూన్లు ఇచ్చానని రెహమాన్ తెలిపారు.

తాను మంచి సినిమాలను ఎప్పుడూ వదులుకోవాలని భావించలేదని, మ్యూజిక్ లవర్స్ తననుంచి ఎంతో ఆశిస్తుంటే ఓ గ్యాంగ్ అందుకు ఆటంకాలు సృష్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రేడియో మిర్చి ఎఫ్ఎం చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News