Sanitizer: చేతులు శుభ్రపరుచుకునేందుకు శానిటైజర్లను అతిగా వాడొద్దు: కేంద్ర ఆరోగ్య శాఖ సూచన

  • కేంద్రం నుంచి కీలక సూచన
  • మాస్కులు ధరించాలని, వేడినీళ్లు తాగుతుండాలని వెల్లడి
  • శానిటైజర్లతో మంచి బ్యాక్టీరియా చనిపోతుందంటున్న నిపుణులు
Centre says no over usage of sanitizers

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ నివారణలో శానిటైజర్లు, మాస్కులు కీలకంగా పనిచేస్తాయని తెలిసిందే. అయితే చేతులను శుభ్రపరుచుకోవడానికి ఉపయోగించే శానిటైజర్లను ఎక్కువగా ఉపయోగించవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

"ఇలాంటి విపత్కర పరిస్థితులు గతంలో ఎన్నడూ తలెత్తలేదు. ఇలాంటి అసాధారణ స్వభావం ఉన్న వైరస్ ఓ మహమ్మారి రూపం దాల్చి విరుచుకుపడుతుందని ఎవరూ ఊహించలేదు. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మాస్కులు ధరించండి, తరచుగా వేడినీళ్లు తాగుతుండండి. శుభ్రంగా చేతులు కడుక్కోండి. అయితే శానిటైజర్లను మాత్రం అతిగా ఉపయోగించవద్దు" అంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ ఆర్కే వర్మ స్పష్టం చేశారు.

కాగా, ఇంతకుముందు కూడా శానిటైజర్లపై ఆరోగ్య నిపుణులు పలు హెచ్చరికలు చేశారు. శానిటైజర్లను అతిగా వినియోగించడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుందని తెలిపారు. శానిటైజర్ బదులు సబ్బు, నీరు ఉపయోగించి చేతులు శుభ్రపరుచుకోవడం శ్రేయస్కరం అని వివరించారు.

More Telugu News