మా నాన్న గారి అస్థికలు త్రివేణి సంగమంలో కలిపేందుకు వెళ్లినప్పుడు ముంబయి ఉగ్రదాడి జరిగింది: పవన్ కల్యాణ్

25-07-2020 Sat 16:41
  • పవన్ ఇంటర్వ్యూలో మూడో భాగం విడుదల
  • బలమైన నాయకత్వం లేదని బాధపడినట్టు పవన్ వెల్లడి
  • మోదీ రూపంలో బలమైన నాయకత్వం కనిపించిందని వివరణ
Pawan Kalyan interview third part released

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తమ సోషల్ మీడియా విభాగం కోసం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూను అనేక భాగాలుగా విడుదల చేస్తున్నారు. తాజాగా ఇవాళ మూడో పార్ట్ రిలీజ్ చేశారు. దీనిలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, తన తండ్రి అస్థికలు  త్రివేణి సంగమంలో కలిపేందుకు వెళ్లినప్పుడే ముంబయిలో తాజ్ హోటల్ పై ఉగ్రదాడి జరిగిందని వెల్లడించారు. ఆ ఆపరేషన్ దాదాపు మూడ్రోజుల పాటు సాగిందని తెలిపారు. అంతకుముందు మరో సంఘటనలో పార్లమెంటు భవనంపైనే ఉగ్రదాడి జరిగిందని, ఈ నేపథ్యంలో తనకు అనేక సందేహాలు వచ్చాయని అన్నారు.

"మనకు బలమైన నాయకత్వం లేదేంటి? దేవాలయం వంటి పార్లమెంటు మీద దాడి జరగడం ఏంటి? అసలు ఉగ్రవాదులు అక్కడి వరకు ఎలా వచ్చారు? అన్న ఆలోచనలు రేగినప్పుడు నరేంద్ర మోదీ కనిపించారు. ఆయన లాంటి బలమైన నేత అవసరం కనిపించింది. 2014లో మోదీ నాయకత్వానికి ఆమోదం లభించడం కూడా ఈ కారణం వల్లనే. కొన్ని నిర్ణయాలు అందరికీ నచ్చకపోవచ్చు. దీర్ఘకాలంలో ఆ నిర్ణయాలే సరైనవి అనిపిస్తాయి. 2014 నుంచి నేను అదే ఆలోచనా విధానాన్ని పాటిస్తున్నాను.

మొన్న చైనా దూకుడు చూసినప్పుడు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పాఠం గుర్తొచ్చింది. భారతదేశంపై జరిగిన దాడులు, దండయాత్రలు చదువుకున్నాం. మనవాళ్లు వీరోచితంగా ఎదురు తిరిగిన ఘట్టాలు కనిపించలేదు. అలాంటి ఆవేదన నుంచి వచ్చిన మా వంటి వాళ్లకు మోదీ రూపంలో బలమైన నాయకత్వం కనిపించింది. 'సరస్సులో ఉన్న మొసలినీ, చైనాలో ఉన్న చౌన్ ఎన్ లైని నమ్మవద్దు' అని దేవరకొండ బాలగంగాధర తిలక్ అప్పుడే చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మన భూభాగం మీద కన్నేయడానికి ఆలోచించాలన్నా భయపడేలా చేయగల నాయకుడు కావాలి. ఆ తరహా నాయకత్వాన్ని మోదీ బలంగా నిరూపించారు" అని వివరించారు.