Chandrababu: కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రముఖ వైద్యులతో మాట్లాడిన చంద్రబాబు

  • జూమ్ యాప్ ద్వారా చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
  • వైరస్ నివారణ, ఇతర అంశాలపై డాక్టర్లతో చర్చ
  • అధ్యయనాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి పంపుతున్నట్టు వెల్లడి
Chandrababu talks to doctors and medical experts on corona situations in AP

ఏపీలో కరోనా చికిత్స, తదితర అంశాలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రముఖ డాక్టర్లతో మాట్లాడారు. జూమ్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన వైద్యులతో కరోనా పరిస్థితులపై, వైరస్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరోనాపై అవగాహన అందరికీ అవసరమని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి, ఇతర అంశాలపై అధ్యయనాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి పంపుతున్నానని తెలిపారు.

కరోనాపై ముందు నిలిచిపోరాడుతున్న యోధులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆగస్టు 15న కరోనా మృత యోధులకు నివాళులు అర్పిద్దామని పిలుపునిచ్చారు. గత 2 వారాల్లో ఏపీలో కరోనా వృద్ధి రేటు అత్యధికంగా ఉందన్నారు. ప్రజలను అప్రమత్తం చేయడం తప్ప ప్రస్తుతానికి మందులు లేవని పేర్కొన్నారు. డిజిటల్ సోషలైజేషన్, భౌతికదూరం రెండూ ముఖ్యమేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

అంబులెన్స్ లు, ఆసుపత్రుల్లోనూ శానిటైజేషన్ ఎంతో ముఖ్యమని అన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో తగు వసతులు ఉంటే రోగులు భయపడకుండా ఉంటారని తెలిపారు. కరోనా మృతులకు సరైన రీతిలో అంతిమ సంస్కారాలు జరగకపోవడం బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. ప్రజలకు వేరే ఏ అత్యవసర చికిత్స అవసరం అయినా కరోనా పరీక్ష చేసి కానీ వైద్యం అందించడంలేదని చంద్రబాబు ఆరోపించారు. కరోనా పరీక్షల ఫలితాల కోసం రోగులు వేచి చూడాల్సి రావడం సరైన విధానం కాదని విమర్శించారు.

More Telugu News