చాతుర్మాస్య దీక్షా వస్త్రాలలో శుభకార్యానికి వచ్చిన పవన్... ఫొటో పంచుకున్న నితిన్

24-07-2020 Fri 18:49
  • నితిన్ ను పెళ్లికొడుకును చేసే కార్యక్రమం 
  • సరికొత్తగా కనిపించిన పవన్
  • కృతజ్ఞతలు తెలిపిన నితిన్
Pawan Kalyan attends to groom making ceremony of Nithin

జనసేనాని పవన్ కల్యాణ్ లోక కల్యాణార్థం చాతుర్మాస్య దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. నాలుగు నెలల పాటు సాగే ఈ దీక్షను నియమనిష్ఠలతో కొనసాగిస్తానని ఇటీవలే పవన్ ప్రకటించారు. అయితే, టాలీవుడ్ హీరో నితిన్ ఎంగేజ్ మెంట్ కొన్నిరోజుల కిందట షాలినితో హైదరాబాదులో జరిగింది. ఈ సందర్భంగా నితిన్ ను పెళ్లికొడుకుగా చేసే నలుగు కార్యక్రమానికి పవన్ తన సన్నిహితులైన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత చినబాబు (ఎస్.రాధాకృష్ణ)లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా పవన్ చాతుర్మాస్య దీక్షా వస్త్రాలలో ఆధ్యాత్మికత ప్రస్ఫుటించేలా కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోను నితిన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. "నా హృదయపు లోతుల్లోంచి మా పవర్ స్టార్ కు వేలవేల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే త్రివిక్రమ్ గారికి, చినబాబు గారికి ధన్యవాదాలు. నన్ను పెళ్లికొడుకును చేసే కార్యక్రమానికి వచ్చి నన్ను దీవించినందుకు ఆనందంగా ఉంది. నిజంగా ఎంతో సంతోషంగా ఉంది" అంటూ నితిన్ ట్వీట్ చేశారు.