Randeep Guleria: ఢిల్లీ, ముంబయి, అహ్మదాబాద్ నగరాల్లో కరోనా ప్రభావం తగ్గుతోంది: ఎయిమ్స్ డైరెక్టర్ వెల్లడి

  • కొన్ని ప్రాంతాల్లో పీక్ స్టేజ్ ముగిసిందన్న గులేరియా
  • వివిధ ప్రాంతాల్లో వివిధ సమయాల్లో పీక్ స్టేజ్ వస్తుందని వెల్లడి
  • పట్టు సడలిస్తే మరోసారి కరోనా ముప్పు తప్పదని హెచ్చరిక
AIIMS Director Randeep Guleria opines on corona spreading trend in country

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిపై ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, దేశంలో కరోనా వ్యాప్తి ఒక్కసారిగా పీక్ స్టేజ్ కి చేరదని, వివిధ ప్రాంతాల్లో  వివిధ సమయాల్లో పీక్ స్టేజ్ కి చేరుతుందని వివరించారు. ప్రస్తుతం ఢిల్లీలో పీక్ స్టేజ్ దశ కూడా ముగిసి కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని తెలిపారు. ముంబయి, అహ్మదాబాద్ వంటి నగరాల్లోనూ, దక్షిణాదిన కొన్ని ప్రాంతాల్లోనూ పీక్ స్టేజ్ ఇప్పటికే పూర్తయి, అక్కడ కేసుల గ్రాఫ్ క్రమంగా కిందికి దిగుతోందని పేర్కొన్నారు.

కేసులు అధికంగా ఉన్న బీహార్, అసోం వంటి రాష్ట్రాల్లో కరోనా నియంత్రణ కోసం దూకుడైన వ్యూహాలు అమలు చేయాల్సి ఉంటుందని గులేరియా అభిప్రాయపడ్డారు. అయితే, భారత్ లోని అనేక ప్రాంతాల్లో కేసుల సంఖ్య తగ్గుతుండడంతో ప్రజలు తమను కరోనా ఏమీ చేయలేదని భావిస్తున్నారని, తద్వారా భౌతికదూరాన్ని విస్మరిస్తున్నారని, మాస్కులు కూడా ధరించకుండా బయటికి వస్తున్నారని, ఈ ధోరణి ప్రబలితే మరోసారి కరోనాను ఆహ్వానించినట్టేనని ఆయన హెచ్చరించారు.

More Telugu News