ఈ 'అప్పడం'తో కరోనాను కట్టడి చేయవచ్చంటున్న కేంద్ర మంత్రి!

24-07-2020 Fri 16:32
  • 'భాభీజీ అప్పడం' తినాలంటున్న కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్
  • ఈ అప్పడం తింటే యాంటీబాడీలు పెరుగుతాయని వెల్లడి
  • సోషల్ మీడియాలో మంత్రిపై జోకులు
Union minister campaigns eat papad to fight corona

కరోనా విషయంలో ఎవరూ ఎలాంటి తప్పుడు సమాచారం వ్యాపింపచేయరాదని ఓవైపు ప్రభుత్వాలు, మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మొత్తుకుంటుంటే, ఈ కేంద్ర మంత్రివర్యుడు మాత్రం తద్విరుద్ధంగా ప్రచారం చేస్తున్నారు. అప్పడం తింటే కరోనాను జయించవచ్చని అంటున్నారు. ఆయన పేరు అర్జున్ రామ్ మేఘ్వాల్. కేంద్ర జలవనరులు, నదీ అభివృద్ధి, గంగా ప్రక్షాళన, పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి.

అది కూడా మామూలు అప్పడం కాదట.. 'భాభీజీ పాపడ్' (వదిన గారి అప్పడం) అనే బ్రాండెడ్ అప్పడం అయితేనే కరోనాతో సమర్థంగా పోరాడుతుందని సెలవిచ్చారు. ఈ అప్పడం తింటే ఒంట్లో కావాల్సినన్ని యాంటీబాడీలు తయారవుతాయని, దాంతో కరోనాపై కత్తిదూయవచ్చని వివరించారు. ఈ 'భాభీజీ అప్పడం' గురించి ప్రత్యేకంగా చెబుతూ అర్జున్ రామ్ మేఘ్వాల్ ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వదిలారు.

అయితే దీనిపై విమర్శలు మామూలుగా రాలేదు. రకరకాల కామెంట్లతో నెటిజన్లు ఆడుకున్నారు. సోషల్ మీడియాలో దీనిపై జోకులు, మీమ్స్ భారీ స్థాయిలో దర్శనమిస్తున్నాయి. కాంగ్రెస్ నేత విజయ్ సింగ్ కూడా దీనిపై స్పందిస్తూ, అప్పడం నమిలితే కరోనా పోతుందని చెబుతున్న ఇలాంటి వాళ్లు కేంద్ర మంత్రిగా ఉన్నారు అంటూ విమర్శించారు.