శ్రుతిహాసన్ ఆ ఛానెల్ ద్వారా మ్యూజిక్ అప్ డేట్స్ ఇస్తుందట!

24-07-2020 Fri 16:23
  • తెలుగులో మళ్లీ జోరు పెంచిన శ్రుతి 
  • బిజీలోనూ సంగీతాన్ని వదలని ముద్దుగుమ్మ
  • ప్రత్యేకంగా యూ ట్యూబ్ ఛానెల్ నిర్వహణ
Shruti Hassan to start a You Tube channel

కమలహాసన్ కూతురిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన శ్రుతి హాసన్, ఆ తర్వాత కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తెలుగులో అగ్రహీరోలందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఆమధ్య ఉన్నట్టుండి ఒక్కసారిగా కొన్నాళ్ల పాటు తెరమరుగైంది. మళ్లీ ఇప్పుడు తెలుగులో తాజా సినిమాలతో జోరు పెంచుతోంది.

ఇక విషయానికొస్తే, శ్రుతి కథానాయిక కాకముందు నుంచే మంచి సింగర్. గతంలోనే కొన్ని ఆల్బమ్స్ కూడా చేసింది. కొన్ని మ్యూజిక్ షోలలో కూడా పాల్గొంది. ఎంతైనా సంగీతం అన్నది తన చిన్నప్పటి నుంచీ తనలో వున్న అభిరుచి కావడంతో అది ఆమెను వదలడం లేదు. అందుకే, కథానాయికగా బిజీగా ఉన్నప్పటికీ సంగీతం మీద కూడా దృష్టి పెడుతోంది.

ఈ క్రమంలో త్వరలో ప్రత్యేకంగా ఓ యూ ట్యూబ్ ఛానెల్ ని ప్రారంభిస్తోందట. ఈ ఛానెల్ ద్వారా తన కొత్త ఆల్బమ్స్ ..మ్యూజిక్ షోస్.. తదితర సంగీతపరమైన అప్ డేట్స్ ను అభిమానులకు అందించడానికి ప్లాన్ చేస్తోందట. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.