Brijesh Patel: ఐపీఎల్ తాజా సీజన్ పై మరింత స్పష్టతనిచ్చిన చైర్మన్

  • సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ పోటీలు
  • యూఏఈ వేదికగా లీగ్ నిర్వహణ
  • మరికొన్ని రోజుల్లో షెడ్యూల్ ప్రకటన
IPL Chairman clarifies on latest season to be held at UAE

కాసుల వర్షం కురిపించే క్రికెట్ లీగ్ గా ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్ ఎప్పుడు ప్రారంభమయ్యేది అధికారికంగా నిర్ధారణ అయింది. భారత్ లో కరోనా పరిస్థితుల కారణంగా ఈ టోర్నీని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గడ్డపై నిర్వహించనున్నామని, ఈ టోర్నీ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు జరుగుతుందని ఐపీఎల్ చైర్మన్ బ్రజేశ్ పటేల్ వెల్లడించారు. స్వయంగా చైర్మనే వెల్లడించడంతో ఐపీఎల్ నిర్వహణపై సందేహాలన్నీ తొలగిపోయాయి.

ఆరంభ మ్యాచ్ సెప్టెంబరు 19న ఉంటుందని, టోర్నీ మెగా ఫైనల్ నవంబరు 8న జరుగుతుందని బ్రజేశ్ పటేల్ వివరించారు. "త్వరలోనే ఐపీఎల్ పాలకమండలి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో చర్చించి ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ను ఖరారు చేస్తాం. ప్రభుత్వ అనుమతులు కూడా వస్తాయని భావిస్తున్నాం. కరోనా పరిస్థితుల నడుమ టోర్నీ నిర్వహిస్తున్నాం కాబట్టి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ను కూడా రూపొందిస్తున్నాం. అయితే, ఐపీఎల్ మ్యాచ్ లు ప్రేక్షకులతో జరపాలా? ప్రేక్షకులు లేకుండా జరపాలా? అనేది యూఏఈ ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా భౌతికదూరం మాత్రం పాటించి తీరాల్సిందే. అందుకే ప్రేక్షకులను అనుమతించే విషయం అక్కడి ప్రభుత్వ నిర్ణయానికే వదిలేస్తున్నాం. మా వంతుగా యూఏఈ క్రికెట్ బోర్డుకు ఓ లేఖ రాస్తాం" అని వివరించారు.

More Telugu News